బాపట్ల జిల్లాలో మహిళల భద్రతను పెంపొందించే లక్ష్యంతో పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, కుంకలమర్రు గ్రామంలోని ఎస్సీ కాలనీ పాఠశాలలో శనివారం ఒక ప్రత్యేక సదస్సు జరిగింది.
జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ మహమ్మద్ మెయిన్ మరియు ఇంకొల్లు సర్కిల్ సీఐ రామా నాయక్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. మహిళలు, బాలికలు ఎదుర్కొనే సమస్యలు, వేధింపుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు వివరించారు.
ఈ సదస్సులో శక్తి యాప్, డయల్ 112 వంటి అత్యవసర సేవల గురించి తెలియజేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మహిళల భద్రత విషయంలో పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
కార్యక్రమంలో ఎస్సై ఖాదర్ బాషా, శక్తి టీం కానిస్టేబుల్ కె. సుబ్బారావు, మహిళా పోలీసులు మేరీ ఆశ, పద్మజ, రైటర్ బాలు, స్థానిక మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు, యువతులు, ఆశ వర్కర్లు, కూలీలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.








