చీరాల పట్టణంలో గురువారం ఉదయం 6.30 గంటలకు విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం (కార్మిక దినోత్సవం) జరగనుంది. బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు డాక్టర్ తాడివలస దేవరాజు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలతో పాటు కార్మికులకు లేబర్ కార్డులు, బీమా పథకాలపై అవగాహన కల్పించనున్నారు.
చీరాల పట్టణంలోని ముంతవారి సెంటర్, రిలయన్స్ డిజిటల్ సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా విశ్వకర్మ ఆయుధపూజ, జన్మదిన వేడుకలతో పాటు భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డుల పంపిణీ, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల బీమా పథకాలపై అవగాహన, రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా అధ్యక్షులు
ఈ యజ్ఞ మహోత్సవానికి చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షులు మువ్వల వెంకటరమణ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నాయకులు, వివిధ రంగాల కార్మికులు, లేబర్, పోస్టల్ శాఖల అధికారులు పాల్గొంటారు.
కార్మికుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం
చీరాల నియోజకవర్గంలోని భవన నిర్మాణ కార్మికులందరికీ ప్రభుత్వ లేబర్ కార్డులు, కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలు అందేలా చర్యలు తీసుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు డాక్టర్ తాడివలస దేవరాజు తెలిపారు.
కొత్త చేరికలు
ఇదే సందర్భంగా చీరాల నియోజకవర్గ బీసీ నాయకులు, విశ్వకర్మ వర్గానికి చెందిన నెల్లిపూడి వెంకట రామకృష్ణ, మువ్వల వెంకటరమణారావు ఆధ్వర్యంలో పలువురు బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని దేవరాజు పిలుపునిచ్చారు.

