ప్రకాశం, 2026-11-26
ఆంధ్రప్రదేశ్ లో నడికుడి నుంచి శ్రీకాళహస్తి వరకు నిర్మిస్తున్న కొత్త రైల్వే మార్గంలో, నడికుడి నుంచి కనిగిరి వరకు ట్రాక్ పనులు పూర్తయ్యాయి. కొత్త రైల్వే స్టేషన్లు కూడా సిద్ధమయ్యాయి. అయితే, స్టేషన్లకు కోడ్ నంబర్లు లేకపోవడం, జోన్ ప్రక్రియ వంటి కారణాలతో రైళ్లు నడపడంలో జాప్యం జరుగుతోందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై కేంద్రాన్ని సంప్రదించి పనులను వేగవంతం అయ్యేలా చూస్తోంది. నడికుడి నుంచి శ్రీకాళహస్తికి కొత్త రైలు మార్గం పనులు ఈ రెండున్నరేళ్లలో వేగవంతం అయ్యాయి. నడికుడి నుంచి కనిగిరి వరకు ట్రాక్ పనులు పూర్తయ్యాయి. కొత్త రైల్వే స్టేషన్లు కూడా సిద్ధం కావడంతో కనిగిరి వరకు రైళ్లను నడపాలని ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తోంది.
కనిగిరి వరకు రైల్వే లైన్ సిద్ధం కావడంతో రైల్వే అధికారులు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. గుంటూరు నుంచి కనిగిరి వరకు రైలు సర్వీసు ప్రారంభమవుతుందని ప్రచారం జరిగినా.. ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడలేదు. గతంలో అధికారులు దర్శి, కనిగిరి వరకైనా రైలును నడుపుతామని చెప్పారు.. ఆ తర్వాత ఆగస్టు నెలలో ఖాయమని ప్రచారం జరిగింది. ఏకంగా రైలు షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి రైల్వే అధికారుల్ని కలిసి రైలు సర్వీసుపై విన్నవించినా ఫలితం లేకుండా పోయింది.
రైళ్లు నడపకపోవడానికి కారణాలు ఇవేనా
నడికుడి నుంచి శ్రీకాళహస్తి రైలు మార్గంలో, నడికుడి నుంచి కనిగిరి వరకు ట్రాక్ పనులు జనవరి నెల నాటికే పూర్తయ్యాయి. దర్శి, పొదిలి, కనిగిరి కొత్త రైల్వే స్టేషన్లు పూర్తయ్యాయి. కాకపోతే, ఈ రైల్వే స్టేషన్లకు కోడ్ నంబర్లు ఇప్పటి వరకు ఇవ్వలేదని చెబుతున్నారు. ఈ కారణంగా కూడా రైళ్లు నడపటం లేదనే చర్చ జరుగుతోంది. విశాఖ దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రక్రియకు సంబంధించి, ఆ ప్రక్రియ కారణమని చెప్పారు. కానీ ఆ జోన్ కూడా ప్రారంభమైంది. అయినప్పటికీ, రైళ్లు నడపటంపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. దీంతో దర్శి, పొదిలి, కనిగిరి ప్రాంతవాసులు రైళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది కాకపోయినా, వచ్చే ఏడాది నాటికైనా రైళ్లు నడపాలని కోరుతున్నారు.
రెండు జిల్లాల్లో పనులు పెండింగ్
పల్నాడు ప్రాంతంలోని నడికుడి నుంచి తిరుపతి జిల్లాలలోని శ్రీకాళహస్తి వరకు మొత్తం 309 కిలోమీటర్ల పరిధిలో రైల్వే పనులు చేపట్టారు. మొత్తం ఐదు దశల్లో ఈ రైలు మార్గం పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఒకటి, రెండు దశలు పూర్తికాగా, ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో మూడు, నాలుగో దశ పనులు ముగింపు దశలో ఉన్నాయి. ప్రకాశం జిల్లా పరిధిలోని ట్రాక్ 145 కి.మీ నిర్మాణం గార్లపేట వరకు పూర్తయ్యింది. ప్రస్తుతం గౌతువారిపల్లి, గార్లపేట రైల్వేస్టేషన్ పనులు ముగింపు దశలో ఉన్నాయి. పేరంగడిపల్లి దగ్గర నేషనల్ హైవే పనులు పూర్తిచేస్తే రైల్వే బ్రిడ్జి పనులు చేపట్టనున్నారు. కనిగిరి వరకు ఈ పనులు పూర్తయ్యాయి కాబట్టి, అక్కడి వరకు రైలు నడిపితే తమకు సౌకర్యవంతంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.


