తిరుపతి, 2026-11-26
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిత్యం భక్తులతో సందడిగా ఉంటుంది. భక్తులు తమ కోరికల మేరకు శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటారు, హుండీలో కానుకలు వేస్తారు. మరికొంతమంది భక్తులు అపార భక్తితో శ్రీవారికి ఆభరణాలు చేయిస్తుంటారు. అయితే తిరుమల చరిత్రలోనే అతిపెద్ద విరాళం నేడు అందనుంది. శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలను ఒక అజ్ఞాత భక్తుడు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఆయన సమక్షంలోనే ఈ అపూర్వ కానుక శ్రీవారికి అందనుంది.
ఇప్పటికే తిరుమలకు చేరుకున్న అజ్ఞాత భక్తుడితోపాటు 121 కిలోల బంగారు ఆభరణాలు ఒక లారీలో పెట్టెలలో వచ్చాయి. భారీ ఎత్తున బంగారు ఆభరణాలను విరాళంగా అందించడానికి ఈ దాత సన్నద్ధమయ్యారు. రంగనాయకుల మండపంలో బంగారు ఆభరణాల ప్రదర్శనకు టీటీడీ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో విరాళం సమర్పించనున్నారు. ఆయన చేతుల మీదుగా టీటీడీ ఈవోకు ఆభరణాలు అందజేయనున్నారు. శ్రీవారిపై అపారమైన భక్తితో ఒక భక్తుడు ఈ భారీ బంగారు కానుకను అందించడంతో, భక్తుల్లోనూ ఈ ఆభరణాలపై ఆసక్తి పెరిగింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుమల పర్యటన చేపట్టనున్నారు. ఆయన గురువారం ఉదయం 8:30 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి, 10 గంటలకు తిరుపతిలోని ఎస్వీ వ్యవసాయ కళాశాల హెలిపాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఘాట్ రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్తారు. 10:45 గంటలకు గాయత్రి నిలయానికి చేరుకుని, ఆ తర్వాత వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి దర్శనం చేసుకుంటారు. 11:35 గంటలకు తిరుమల శ్రీవారి బంగారు ఆభరణాల సమర్పణ కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి సమక్షంలో అజ్ఞాత భక్తుడు 121 కిలోల బంగారు ఆభరణాలను సమర్పించనున్నారు. దాతల నుంచి బంగారు ఆభరణాలను అధికారికంగా స్వీకరించే కార్యక్రమం కూడా ఉంది. గతంలోనూ టీటీడీ శ్రీవారికి కిరీటం, పద్మ పాదాలు వంటి ఆభరణాలను స్వీకరించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తిరుమల పర్యటన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంకు వెళ్తారు. సాయంత్రం అమరావతికి చేరుకుంటారు.



