క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-23
ఎన్నికల సమయంలో విభిన్న రాజకీయాలు సహజమని, నాయకుల మధ్య అటువంటి రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని, ఎన్నికలు పూర్తయిన తర్వాత విభేదాలు లేకుండా అందరూ అభివృద్ధి పనులపై దృష్టి పెట్టి ప్రజలు తమపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అన్నారు. సోమవారం జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం, అభినందన సభలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు ఎంపీ అభినందనలు తెలిపారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వారు, పాత నాయకత్వం సలహాలు సూచనలు తీసుకోవాలని, సీనియర్లు, జూనియర్లు అందరూ కలిసి పనిచేయాలని అన్నారు.
అభివృద్ధి పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు కూడా సహకరించాలని ఎంపీ కోరారు. చిన్న చిన్న నిబంధనల పేరుతో పనులు ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ధోరణి నుంచి అధికారులు బయటకు వచ్చి ప్రజా ప్రతినిధులకు సహకారం అందిస్తూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు తమ వంతు తోడ్పాటు అందించాలని ఎంపీ కోరారు. వచ్చే రోజుల్లో జంగారెడ్డిగూడెం పరిసరాల్లో పరిశ్రమలు వస్తాయని, ఈ పట్టణం మరింత పెద్ద నగరంగా అభివృద్ధి చెందుతుందని ఎంపీ జోస్యం చెప్పారు. పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలని ఎంపీ కొత్త పాలకవర్గ సభ్యులకు ఉద్బోధించారు. చైర్మన్, కౌన్సిలర్లు సహా కొత్త పాలకవర్గంలోని నేతలంతా అవినీతికి చోటు ఇవ్వకుండా నిస్వార్ధంగా సేవ చేసి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలని అన్నారు.
ఏలూరులోని తన కార్యాలయం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పిన ఎంపీ, స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా ఏ అవసరం ఉన్నా తనను సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు. కేంద్ర పథకాలు, వాటి ద్వారా వచ్చే నిధులను కూడా ఉపయోగించుకోవాలని ఎంపీ సూచించారు. వచ్చే రెండున్నరేళ్లు అభివృద్ధి చేసి చూపిస్తే ప్రజలు మళ్లీ కూటమి ప్రభుత్వాన్నే ఆదరిస్తారనడంలో సందేహం లేదని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రసంగాల అనంతరం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చేతుల మీదుగా మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సభికుల నుంచి ఒక వ్యక్తి నేవీ డిపో విషయాన్ని లేవనెత్తుతూ జంగారెడ్డిగూడెం వద్ద నేవీ ఆయుధ డిపోను పెట్టే విషయం పరిశీలించాలని ఎంపీని కోరారు. దీనిపై స్పందించిన ఎంపీ, ముందుగా ఈ ప్రాంతంలోని ప్రజా ప్రతినిధులు, పెద్దలంతా చర్చించుకుని తన వద్దకు వస్తే అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందామని తెలిపారు.



