బాపట్ల, 8 November
విజయవాడలో ఆదివారం నిర్వహించిన నేషనల్ ఓపెన్ కరాటే టోర్నమెంట్లో జిల్లా చీరాల సందీప్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయాలు సాధించారు. వివిధ ప్రాంతాలకు చెందిన వెయ్యి మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో చీరాల విద్యార్థులు సత్తా చాటారు. ఎల్లో బెల్ట్ కాటా విభాగంలో పడవల కీర్తి పవన్ సాయి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, వైట్ బెల్ట్ కాటా విభాగంలో రాయపాటి వెంకట సాయి కౌశిక్ ద్వితీయ స్థానాన్ని సాధించాడు. ఈ విజయాలతో పాఠశాలకు, చీరాల పట్టణానికి మంచి గుర్తింపు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సందీప్ స్కూల్ వ్యవస్థాపకులు డాక్టర్ టి. వెంకటేశ్వర్లు (టీవీ సార్) మాట్లాడుతూ కరాటే శిక్షణ ద్వారా క్రమశిక్షణ, ఆత్మరక్షణ, ఆరోగ్యం వంటి ప్రయోజనాలు కలుగుతాయని, యువత తప్పనిసరిగా ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ పొందాలని సూచించారు. పాఠశాల ప్రిన్సిపల్ జి. లావణ్య మాట్లాడుతూ మారుతున్న సమాజంలో బాలికలు ఆత్మరక్షణ కోసం కరాటే వంటి యుద్ధ విద్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. కరాటే ఇన్స్ట్రక్టర్ ఎన్. శివప్రసాద్, ఎలిమెంటరీ స్కూల్ ఇన్చార్జి ఉమాదేవి విజేతలను అభినందించారు.


