కె. కోటపాడు, 12 November
ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని మాల సామాజిక వర్గానికి కేటాయించాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని మాల సామాజిక వర్గానికి కేటాయించి, తగిన ప్రాధాన్యత కల్పించాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 1990 నుంచి 1995 వరకు మాదిగ సామాజిక వర్గానికి చెందిన స్వర్గీయ పాలపర్తి డేవిడ్ రాజుకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కల్పించారని గుర్తుచేశారు. అప్పట్లో ఎన్.జి. మండలంలోని మాల సామాజిక వర్గం ప్రజలు ఆయనకు పూర్తి మద్దతు తెలిపారని పేర్కొన్నారు.
జిల్లాల విభజన అనంతరం ప్రస్తుత ప్రకాశం జిల్లాలో మాల సామాజిక వర్గం జనాభా అధికంగా ఉన్నందున, సామాజిక న్యాయం, జనాభా దామాషా ప్రాతిపదికన ఈసారి జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని మాలలకు కేటాయించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ మాదిగ సామాజిక వర్గానికి రెండు క్యాబినెట్ మంత్రి పదవులతో పాటు పలు నామినేటెడ్ పదవులు కల్పించి ప్రాధాన్యత ఇచ్చిందని, అదే విధంగా మాల సామాజిక వర్గానికి కూడా తగిన రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. ఈ మేరకు టీడీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్లు ప్రత్యేక చొరవ తీసుకుని మాలలకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కేటాయించేలా కృషి చేయాలని దారా అంజయ్య విజ్ఞప్తి చేశారు.






