వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. చీమకుర్తి బాలకృష్ణ నూనె కొట్టు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలకు ఉచితంగా 1000 మట్టి వినాయక ప్రతిమలు, 1000 వ్రతకల్పం పుస్తకాలను పంపిణీ చేశారు.
పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా సహజసిద్ధమైన మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను పూజించాలని రోటరీ సభ్యులు ప్రజలకు సూచించారు. మట్టి వినాయక ప్రతిమలను పూజించడం ద్వారా సంప్రదాయాన్ని కాపాడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
వినాయకచవితి అనంతరం మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కలిసిపోతాయని, తద్వారా చెరువులు, కాలువలు, నదులు వంటి నీటి వనరులు కాలుష్యం కాకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, పండుగలను పర్యావరణహితంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భక్తులకు వ్రతకల్పం పుస్తకాలను కూడా పంపిణీ చేసి, వినాయకచవితి పూజా విధానాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేలా ప్రోత్సహించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు తిరుమలశెట్టి లక్ష్మీ ప్రతాప్, సిహెచ్. బాల వెంకటేశ్వరరావు, పోలుదాసు రామకృష్ణ, బండారుపల్లి హేమంత్ కుమార్, డి.వి. సురేష్, వలివేటి మురళీకృష్ణ, హేమంత్ కుమార్, కి.జి.వై. ప్రసాద్, రఘుకుమార్, స్వామి, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని రాబోయే రోజుల్లో కూడా ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను కొనసాగిస్తామని రోటరీ సభ్యులు తెలిపారు.











