లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఉపాధ్యాయులపై వైసీపీ గూండాలు దాడులు చేస్తున్నారని తెలుగు యువత రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీకాంత్ చెన్నుపాటి ఆరోపించారు. విద్యారంగం, ఉద్యోగుల సమస్యలపై చర్చకు టీడీపీ సిద్ధంగా ఉందని, దమ్ముంటే వైసీపీ రావాలని ఆయన సవాల్ విసిరారు.
సమాజానికి మార్గదర్శకులుగా ఉంటూ గురుదేవోభవ అని గౌరవం అందుకునే ఉపాధ్యాయులపై వైసీపీ మూకలు భౌతిక దాడులకు తెగబడటం అత్యంత సిగ్గుచేటని తెలుగు యువత రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీకాంత్ చెన్నుపాటి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో జరిగిన వేల కోట్ల లిక్కర్ కుంభకోణం, దోపిడీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే జగన్ రెడ్డి గ్యాంగ్ పక్కా ప్రణాళికతో ఉపాధ్యాయులపై దాడులు చేయిస్తోందని ఆయన మండిపడ్డారు.
లిక్కర్ స్కామ్ పాపాలు కప్పిపుచ్చుకునేందుకే దాడులు
గత ఐదేళ్ల పాలనలో వందల కోట్ల లిక్కర్ స్కామ్‌లతో రాష్ట్రాన్ని దోచుకుతిన్న జగన్ అండ్ కో, ఇప్పుడు ఆ నిజాలు బయటకు వస్తుండటంతో డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు. నిబంధనల ప్రకారం పరీక్షలు రాసి, అర్హతతో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులపై అసభ్యకరంగా మాట్లాడుతూ భౌతిక దాడులకు దిగడం జగన్ పెంచి పోషించిన గొడ్డలి సంస్కృతికి నిదర్శనమన్నారు.
చర్చకు లోకేష్ సిద్ధం... దమ్ముంటే రావాలి
రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం, ఉపాధ్యాయుల ఆత్మగౌరవంపై ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సిద్ధంగా ఉన్నారని శ్రీకాంత్ స్పష్టం చేశారు. తమ సవాల్‌ను స్వీకరించే దమ్ము లేకనే వైసీపీ నాయకులు, వారి సైకో గ్యాంగ్‌లు ఇలాంటి గూండాగిరీకి పాల్పడుతున్నారని నిలదీశారు.
ఉపాధ్యాయులకు అండగా తెలుగు యువత
ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా ఇంకా వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్న వైసీపీ గూండాలపై పోలీసులు వెంటనే నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు, ప్రభుత్వ ఉద్యోగులకు తెలుగు యువత ఎల్లప్పుడూ కొండంత అండగా ఉంటుందని, గురువులను అవమానించిన వారిని సమాజం ఎప్పటికీ క్షమించదని హెచ్చరించారు.
విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయులపై దాడి చేసిన దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు తగిన రక్షణ కల్పించాలని శ్రీకాంత్ చెన్నుపాటి డిమాండ్ చేశారు. లేదంటే తెలుగు యువత ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.












