త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్ధం కావాలని చీరాల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ కరణం వెంకటేష్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం మండలం రామన్నపేటలోని దంతం వెంకట సుబ్బారావు సమావేశ మందిరంలో మండల వైఎస్సార్సీపీ సమావేశం ఆయన ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా కరణం వెంకటేష్ బాబు మాట్లాడుతూ, రానున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు బూత్ స్థాయి నుంచి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు ప్రజలతో నిరంతరం మమేకమై, గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. పార్టీ బలపరిచిన ప్రతి అభ్యర్థి విజయానికి కృషి చేయడం నాయకులు, కార్యకర్తల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల బసవ పున్నారెడ్డి, రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షులు బీరక సురేంద్ర, మండల వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, బూత్ కమిటీ కన్వీనర్లు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












