ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలోని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో 202627 విద్యా సంవత్సరానికి సంబంధించిన బ్యాడ్మింటన్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు బుధవారం చీరాలలో నిర్వహించారు. ఈ పోటీల్లో సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు ఎంపికయ్యారు.
చీరాలలోని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియంలో అండర్14, అండర్17, అండర్19 బాలురు, బాలికల విభాగాల్లో ఈ పోటీలు జరిగాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. బాలికల విభాగంలో చీరాలలోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలకు చెందిన దగ్గుబాటి జ్యోతిశ్రీ, మూకిరి సురేఖ, జ్యోత్స్న, దేవరపల్లి సలోమీ ప్రతిభ కనబరిచి ఎంపికయ్యారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ గారపాటి పుష్పరాజు తెలిపారు.
అండర్19 విభాగంలో ప్రతిభ కనబరిచిన ఈ క్రీడాకారులను తదుపరి స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థినులను ప్రిన్సిపాల్, కళాశాల అధ్యాపక సిబ్బంది అభినందించారు. రానున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.











