త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు పోలకం చంద్రశేఖర్ పేరు జడ్పీటీసీ అభ్యర్థిగా స్థానిక రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పందిళ్లపల్లి సర్పంచ్ స్థానం ఓసీకి కేటాయిస్తే అక్కడి నుంచి పోటీ చేయాలని, లేదంటే జడ్పీటీసీ స్థానానికి బరిలోకి దిగాలని ఆయన భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
దాదాపు మూడు దశాబ్దాలుగా రాజకీయాలతో అనుబంధం కలిగిన చంద్రశేఖర్, ఎన్టీఆర్ వీరాభిమానిగా టీడీపీ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. సీనియర్ నాయకులు పల్లపోలు బుల్లబ్బాయి, చల్లా జనార్ధన్ నాయకత్వంలో సుమారు 12 ఏళ్లపాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
రాజకీయాలతో పాటు గ్రామంలో దేవస్థానాల నిర్మాణం, సామాజిక కార్యక్రమాలు, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం వంటి సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యతో కలిసి మండలంలో టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
మండలంలోని వివిధ గ్రామాల్లో పరిచయాలు, ప్రజలతో సత్సంబంధాలు, సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం తనకు రాజకీయంగా కలిసివస్తాయని ఆయన అనుచరులు భావిస్తున్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రశేఖర్కు అవకాశం కల్పించాలని అనుచరులు కోరుతున్నారు. అయితే ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేస్తారన్నది రిజర్వేషన్లు, పార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉంది. దీంతో టీడీపీ అధిష్ఠానం ఆయనకు ఎలాంటి అవకాశం కల్పిస్తుందన్నది మండల రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.











