వేటపాలెం, 2026-11-16
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా కొత్త కాంగ్రెస్ ఆవిర్భవిస్తుందని ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి పీవీ మోహన్ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నాయకత్వంలో చీరాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయని, కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనానికి చీరాల వేదికగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి పీవీ మోహన్ సోమవారం వేటపాలెం మండలం పందిళ్లపల్లిలోని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ఇటీవల చీరాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన 10 మంది కౌన్సిలర్లు, నలుగురు ఎంపీటీసీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా పీవీ మోహన్ మాట్లాడుతూ, చీరాలలో కాంగ్రెస్ సాధించిన విజయం అంత సులభంగా వచ్చినది కాదని, ఇది సరైన నాయకత్వానికి, కార్యకర్తల సమష్టి కృషికి నిదర్శనమని అన్నారు. చీరాల ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన విశ్వాసం రాష్ట్రంలో పార్టీ పూర్వ వైభవానికి నాంది పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు పూర్తయిన అనంతరం, చీరాల వేదికగా భారీ విజయోత్సవ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తామని వెల్లడించారు. ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతామని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ, చీరాల ప్రజలు అందించిన విజయాన్ని తాము గర్వంగా కాకుండా గౌరవంగా, అంతకుమించి బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి రెండింతలుగా సేవలందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, పట్టణ అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
నూతనంగా ఎన్నికైన ప్రతినిధుల పరిచయం
అనంతరం నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులను ఆమంచి కృష్ణమోహన్ ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి పీవీ మోహన్‌కు పరిచయం చేశారు.
ఈ కార్యక్రమంలో మేడిద దివ్య సుధాకర్, కౌన్సిలర్లు దాసరి శ్రీకాంత్, మేరుగ మేరీ రాణి, పోలుదాసు అంజిబాబు, గోలి మాధవి, షేక్ మాములా, రామిశెట్టి వెంకట్రావు, తుపాకుల రాఘవేంద్రరావు, ఇట్టా శ్రీలక్ష్మి, సల్లూరి రాజ్యం, పాపబత్తుల థామస్, ఎంపీటీసీ సభ్యులు గాదె సురేంద్రబాబు, ఉసా శివశంకర్, యర్ర శివశంకర్, కాటం లక్ష్మి, మసనం శ్రీనివాసరావుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






