అమరావతి, 16 November
రొయ్య రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తూ, కూటమి ప్రభుత్వంపై జగన్, సాక్షి పత్రిక అసత్య ప్రచారం చేస్తున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు.
రొయ్య రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తూ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్, సాక్షి పత్రిక కలిసి కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారానికి తెరలేపారని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. రైతుల కష్టాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ, ప్రభుత్వం చేపడుతున్న చర్యలను దాచిపెట్టి తప్పుడు కథనాలు ప్రచురించడం సిగ్గుచేటన్నారు. ఆర్నాబ్, మురసు తుఫానుల కారణంగా 1,071 మంది ఆక్వా రైతులకు చెందిన 1,720.90 హెక్టార్లలో నష్టం జరిగినట్లు గుర్తించి, ఎన్డీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం రూ.3.96 కోట్ల నష్టం అంచనా వేసి కేంద్రానికి పరిహార ప్రతిపాదనలు పంపామని తెలిపారు. తుఫానులకు ముందే రైతులను అప్రమత్తం చేసి నష్టనివారణ చర్యలు చేపట్టామని, ఇన్ని చర్యలు తీసుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సాక్షి ఎలా రాస్తుందని ప్రశ్నించారు.
గత ప్రభుత్వ హయాంలో 100 కౌంట్ రొయ్యల ధర కిలో రూ.200 నుంచి రూ.210 మధ్య ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్లో రూ.280కి చేరిన విషయం జగన్కు, సాక్షికి కనిపించలేదా అని మంత్రి నిలదీశారు. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్, సరఫరా, ఎగుమతుల పరిస్థితుల వల్ల ధరల్లో హెచ్చుతగ్గులు వస్తాయని, ప్రపంచ మార్కెట్ పరిస్థితులకు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యులను చేయడం రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు. రైతులకు మెరుగైన ధరలు అందించేందుకు ఫార్మ్గేట్ ప్రైస్ మానిటరింగ్ కమిటీ ద్వారా పర్యవేక్షణ చేపడుతున్నామని, మేత ధరలపై ప్రతి 45 రోజులకు రైతు సంఘాలు, కంపెనీలతో సమీక్షిస్తున్నామని తెలిపారు. రైతులకు లాభం చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, వాస్తవాలను వక్రీకరించి భయాందోళనలు సృష్టించడం జగన్, సాక్షికే చెల్లిందని విమర్శించారు.
ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సాక్షి ఎందుకు దాచిపెడుతోందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 75 వేల ఆక్వా విద్యుత్ కనెక్షన్లకు రూ.1,300 కోట్ల మేర రాయితీ కల్పిస్తూ అర్హులైన రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే అందిస్తున్నామని వివరించారు. రైతుల సాగు వ్యయం తగ్గించడం, గిట్టుబాటు ధరలు అందించడం, ఎగుమతి అవకాశాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
రైతుల సమస్యలను ఎత్తిచూపితే స్వాగతిస్తామని, కానీ వారి కష్టాలను అడ్డుపెట్టుకొని రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. జగన్, వైసీపీ, సాక్షి ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు అండగా నిలుస్తుందని, రైతుల సంక్షేమం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

