కావలి, ఆంధ్రప్రదేశ్ (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 16
కావలి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు.
కావలి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా కూటమి చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్ నామినేషన్ కార్యక్రమం అత్యంత కోలాహలంగా జరిగింది. కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో భరత్ కుమార్ మున్సిపాలిటీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భవిష్యత్తు నాయకులు నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంతో పాటు కావలి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని కొనియాడారు.
అభివృద్ధి చేసే ప్రభుత్వానికే పట్టం
అభివృద్ధి చేసే ప్రభుత్వానికే పట్టం కట్టాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. గత రెండున్నర సంవత్సరాల కాలంలోనే కావలిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. పనిచేసే ప్రభుత్వం, పనిచేసే ఎమ్మెల్యే ఉన్నందున, మున్సిపాలిటీలో కూడా కూటమి చైర్మన్ గెలిస్తే అభివృద్ధి పనులు మరింత వేగవంతమవుతాయని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజ్ఞులైన కావలి ప్రజలు తనకు ఏ విధంగానైతే భారీ మెజార్టీని ఇచ్చారో, అదే స్ఫూర్తితో కూటమి అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్ను కూడా ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కావలి మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 44 వార్డుల్లోనూ టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు సమిష్టిగా కష్టపడి కూటమి అభ్యర్థులందరినీ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. నామినేషన్ల ప్రక్రియ ఘనంగా ముగిసిందని, రేపటి నుంచే ప్రచార కార్యక్రమాలను ప్రారంభించి ప్రతి ఓటరు వద్దకు వెళ్లనున్నట్లు ఆయన ప్రకటించారు.
చైర్మన్ అభ్యర్థి భరత్ కుమార్ హామీ
చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్ మాట్లాడుతూ.. కావలి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన కూటమి పెద్దలకు, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే మార్గదర్శకత్వంలో కోట్ల రూపాయల నిధులతో కావలి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎల్లప్పుడూ అండగా నిలిచిన ముస్లిం మైనారిటీ సోదరుల సంక్షేమానికి, షాదీ మంజిల్ వంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. కావలి ప్రజలు తనకు ఒక అవకాశాన్ని కల్పించాలని కోరారు.
కూటమి విజయంపై జనసేన నేత భరోసా
జనసేన నేత సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతోందన్నారు. ఓసీ స్థానంలో బీసీ అభ్యర్థికి అవకాశం కల్పించడం కూటమి సామాజిక న్యాయానికి నిదర్శనమని కొనియాడారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఒకే తాటిపైకి వచ్చి సైకిల్, గ్లాసు, కమలం గుర్తులకు ఓట్లు వేయించి 44 వార్డుల్లోనూ కూటమిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మలిశెట్టి వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షులు గుర్తుకొడ కిషోర్, కావలి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పోతుగట్టి అలేఖ్య, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, కూటమి నేతలు పాల్గొన్నారు.


