వార్షిక (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 16
శబరిమల అయ్యప్ప స్వామి మండల, మకరవిళక్కు మహోత్సవాలకు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. దేశవ్యాప్తంగా తరలివచ్చే అయ్యప్ప భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, సంతృప్తికరమైన యాత్రా అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు బోర్డు చైర్మన్ కె. జయకుమార్ తెలిపారు.
శబరిమల అయ్యప్ప స్వామి మండల, మకరవిళక్కు మహోత్సవాలకు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. దేశవ్యాప్తంగా తరలివచ్చే అయ్యప్ప భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, సంతృప్తికరమైన యాత్రా అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు చైర్మన్ కె. జయకుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌కు రాసిన లేఖలో శబరిమల యాత్ర ఏర్పాట్ల వివరాలను తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు శబరిమలను సందర్శిస్తుంటారని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యాత్ర విజయవంతానికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈ ఏడాది శబరిమల ఉత్సవాల ప్రధాన నినాదంగా పరిశుభ్రమైన శబరిమల పవిత్రమైన శబరిమలను నిర్ణయించినట్లు తెలిపారు. గతంలో భక్తులు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తించి, వాటిని అధిగమించేలా పలు మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, కొత్త పారిశుద్ధ్య విధానాన్ని అమల్లోకి తెచ్చామని వివరించారు.
భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్ల వినియోగాన్ని పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. వాటి నిరంతర పరిశుభ్రత, నిర్వహణ కోసం ప్రత్యేక ప్రొఫెషనల్ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. అలాగే భక్తుల సంఖ్యకు అనుగుణంగా తగినంత పరిమాణంలో అరవణ ప్రసాదం అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. మరోవైపు పంపా నదిలో భక్తులు పాత దుస్తులను వదిలివేయడం పర్యావరణ పరిరక్షణకు సవాలుగా మారిందని జయకుమార్ పేర్కొన్నారు. ఈ ఆచారానికి ఎలాంటి మతపరమైన లేదా సంప్రదాయపరమైన ప్రాముఖ్యత లేదని, భక్తులు నదిలో పాత దుస్తులను వదిలివేయకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి, అయ్యప్ప భక్తులకు చేరవేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. రెండు నెలల పాటు కొనసాగనున్న శబరిమల మహోత్సవాలను పరిశుభ్రత, భక్తుల భద్రత, మెరుగైన సౌకర్యాల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు చైర్మన్ కె. జయకుమార్ వెల్లడించారు.

