చీరాల, 11 November
చీరాల పట్టణ అభివృద్ధి, సమస్యలపై విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో పట్టణంలో ప్రజల సమస్యలు, అభివృద్ధి పనులు, మౌలిక వసతుల మెరుగుదల వంటి అంశాలపై చర్చించారు.
చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం చీరాల పట్టణ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీరాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సాధించిన అఖండ విజయంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ప్రజల మద్దతుతో విజయం సాధించిన కౌన్సిలర్లకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ విజయం కూటమి నాయకులు, కార్యకర్తల సమష్టి కృషికి, ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.
అనంతరం పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యలు, పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, అభివృద్ధి పనుల అమలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కౌన్సిలర్లు, వార్డు ఇన్చార్జిలు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించాలని తెలిపారు.
చీరాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నాయకులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దోగుపర్తి సురేష్, నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు, వార్డు ఇన్చార్జిలు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






