బాపట్ల, 2026-11-27
బాల్య వివాహరహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పిలుపునిచ్చారు. బాల్య వివాహాల వల్ల బాలికల భవిష్యత్తు దెబ్బతినడమే కాకుండా సమాజ ఆర్థిక, సామాజిక, ఆరోగ్య పరిస్థితులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ బాల్య వివాహాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
బాల్య వివాహరహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పిలుపునిచ్చారు. బాల్య వివాహాల వల్ల బాలికల భవిష్యత్తు దెబ్బతినడమే కాకుండా సమాజ ఆర్థిక, సామాజిక, ఆరోగ్య పరిస్థితులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ బాల్య వివాహాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారితో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వ శాఖలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, వివిధ మతాల పెద్దలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బాల్య వివాహాల నివారణ దిశగా చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్న అధికారులు, స్వచ్ఛంద సంస్థలను ప్రత్యేకంగా అభినందిస్తామని తెలిపారు. బాల్య వివాహాలను పూర్తిస్థాయిలో అరికట్టడం ద్వారా ఆరోగ్యకరమైన, ఆర్థికంగా బలమైన సమాజాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి మాట్లాడుతూ బాలికల పట్ల సమాజ ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆడపిల్లలను భారంగా భావించి బాల్యంలోనే వివాహాలు చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. బాల్య వివాహాల వల్ల కలిగే సామాజిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన దుష్పరిణామాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయడంతో పాటు గ్రామస్థాయిలో బాల్య వివాహాల నివారణ కమిటీలను మరింత చురుకుగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పద్మా సునంద మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో బాల్య వివాహాలకు సంబంధించి 87 ఫిర్యాదులు అందాయని, అధికారుల సమన్వయంతో వాటన్నింటినీ అడ్డుకున్నామని తెలిపారు. బాల్య వివాహాల నివారణకు తమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు, వాటి పురోగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు, స్టెప్ సీఈవో శ్రీమన్నారాయణ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, జిల్లా బాలికల అభివృద్ధి అధికారి హేమలత, డీసీపీఓ దినేష్ కుమార్, యువసాథీ మిషన్ డీపీఏ సిద్ధిక్ తదితరులు పాల్గొన్నారు. వివిధ మతాల పెద్దలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు బాల్య వివాహాల నివారణకు తమ సంస్థల తరఫున చేపడుతున్న చర్యలను వివరించారు. బాల్య వివాహాలను ధైర్యంగా ఎదిరించి ప్రస్తుతం డిగ్రీ విద్యను అభ్యసిస్తున్న ఇద్దరు బాలికలు ఈ కార్యక్రమంలో తమ అనుభవాలను పంచుకున్నారు. తమ సమస్యలపై వెంటనే స్పందించి బాల్య వివాహాలను అడ్డుకున్న ప్రభుత్వ యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. బాలికల ధైర్యాన్ని, చదువుపై చూపుతున్న ఆసక్తిని అధికారులు అభినందించారు.



