బాపట్ల, 2026-11-20
బాపట్ల జిల్లా పరిషత్ తొలి చైర్‌పర్సన్‌గా పూషడపు రోహిణి, వైస్ చైర్‌పర్సన్‌గా కలవకూరి పిచ్చమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
బాపట్ల జిల్లా ఏర్పడిన అనంతరం జిల్లా పరిషత్‌కు తొలి పాలకవర్గం కొలువుదీరింది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పూషడపు రోహిణి, వైస్ చైర్‌పర్సన్‌గా కలవకూరి పిచ్చమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం బాపట్లలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన పరోక్ష ఎన్నికల ప్రక్రియలో ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించి, ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. తొలుత 20 మంది జెడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి, అనంతరం ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. మధ్యాహ్నం 1.50 గంటలకు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభించగా, ఒక్కో పదవికి ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలైంది. దీంతో పూషడపు రోహిణి, కలవకూరి పిచ్చమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. అనంతరం మధ్యాహ్నం 2.05 గంటలకు ఎన్నికైన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.
2.12 గంటలకు నూతన పాలకవర్గ తొలి సమావేశం నిర్వహించగా, 2.52 గంటలకు వారు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యేలు వేగేశన నరేంద్రవర్మ, ఏలూరి సాంబశివరావు, నక్కా ఆనంద్‌బాబు, బుడా చైర్మన్ సలగల రాజశేఖర్‌బాబు నూతన పాలకవర్గానికి అభినందనలు తెలిపారు. పూల మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కూడా నూతన పాలకవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ హరికుమార్, జిల్లా పరిషత్ సీఈఓ విజయలక్ష్మి, అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


