చీరాల, 2026-09-01
దళిత బహుజన రిసోర్స్ సెంటర్ (డిబిఆర్సీ) ఆధ్వర్యంలో స్థానిక రోశయ్య కాలనీలో డిజిటల్, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బ్యాంకింగ్ సేవలు, పొదుపు, పెట్టుబడులు, సైబర్ మోసాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.
దళిత బహుజన రిసోర్స్ సెంటర్ (డిబిఆర్సీ) ఆధ్వర్యంలో స్థానిక రోశయ్య కాలనీలో డిజిటల్, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బ్యాంకింగ్ సేవలను సురక్షితంగా వినియోగించడం, ఆదాయంలో కొంత భాగాన్ని భవిష్యత్ అవసరాలకు పొదుపు చేసుకోవడం, కుటుంబ బడ్జెట్ను రూపొందించి సరైన నిర్వహణ, బీమా, ఇతర పెట్టుబడులు, సైబర్ మోసాల నివారణపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
డిబిఆర్సీ ఏరియా కోఆర్డినేటర్ వేము భగవాన్ దాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ వై. సుబ్రమణ్యం, ఆర్థిక అక్షరాస్యత నిపుణులు, సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ వై. ప్రశాంత్ హాజరై ప్రజలకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ వై. సుబ్రమణ్యం, సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ వై. ప్రశాంత్ మాట్లాడుతూ కుటుంబ ఆర్థిక భద్రత కోసం ప్రతి ఒక్కరూ పొదుపు చేయాలని సూచించారు. ఆదాయం, ఖర్చులను సక్రమంగా నిర్వహిస్తూ అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని తెలిపారు. బ్యాంకు ఖాతాలు, పాస్బుక్లు, బ్యాంకింగ్ సేవలను సక్రమంగా వినియోగించుకోవాలని వివరించారు.
యూపీఐ, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలను జాగ్రత్తగా ఉపయోగించాలని సూచించారు. ఓటీపీ, పిన్, సీవీవీ, పాస్వర్డ్లను ఇతరులతో పంచుకోకూడదని అవగాహన కల్పించారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్లు, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
కుటుంబ భద్రత కోసం బీమా తీసుకోవడం, భవిష్యత్ అవసరాల కోసం సురక్షితమైన పెట్టుబడులు పెట్టాలని వివరించారు. పిల్లల విద్య, ఆరోగ్యం, అత్యవసర అవసరాల కోసం ముందుగానే ఆర్థిక ప్రణాళిక చేసుకోవాలని తెలిపారు. మహిళలు కూడా బ్యాంకింగ్, పొదుపు, డిజిటల్ చెల్లింపులను స్వతంత్రంగా వినియోగించుకోవాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ నాయకులు ఏకలక్ష్మి, సురేష్, జనీభాషా తదితరులు పాల్గొన్నారు.












