చంద్రగిరి, 2026-11-25
చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, రిటర్నింగ్ అధికారులు అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగి నామినేషన్లను తిరస్కరిస్తున్నారని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన బాధిత అభ్యర్థులతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
చంద్రగిరి నియోజకవర్గంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావడం లేదని, రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు) తమకు నచ్చినట్లుగా వ్యవహరించారని, బాధిత అభ్యర్థులతో కలసి టవర్ క్లాక్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట వినూత్నంగా నిరసన తెలుపుతూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నామినేషన్ల తిరస్కరణ నుంచి ఏకగ్రీవాల వరకు ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన జరిగిందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రాథమిక హక్కును అధికారులు తమ నిర్ణయాలతో కాలరాస్తున్నారని మండిపడ్డారు. నామినేషన్ల తిరస్కరణతో ఎంతోమంది అభ్యర్థుల రాజకీయ జీవితాలను అర్ధాంతరంగా ముగించారని చెవిరెడ్డి విచారం వ్యక్తం చేశారు. రిటర్నింగ్ అధికారులు అధికార పార్టీ ఎమ్మెల్యేల ఒత్తిళ్లకు లొంగి, నిబంధనలను పక్కనపెట్టి ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యంలో పోటీ చేసే అవకాశం కల్పించాల్సిన అధికారులే నామినేషన్ల తిరస్కరణకు కారణమవుతున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడినట్లు తేలిన అధికారులను కఠినంగా శిక్షించి, జైలుకు పంపితేనే దిగజారుతున్న ఎన్నికల ప్రక్రియకు అడ్డుకట్ట పడుతుందని ఆయన పేర్కొన్నారు.







