కృష్ణా, 2026-11-20
దళితవాడల అభివృద్ధి అంటే కేవలం ఒక కాలనీని అభివృద్ధి చేయడం కాదని, అక్కడ నివసించే ప్రతి ఒక్క వ్యక్తికి, కుటుంబానికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే నిజమైన అభివృద్ధి అని తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
ఉయ్యూరు ఎస్సీ కాలనీ సెంటర్లో టీం ఎలైట్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వై.వీ.బీ. రాజేంద్ర ప్రసాద్‌తో పాటు ఉయ్యూరు మున్సిపల్ ఛైర్మెన్ ప్రవీణ్ కుమార్, 8, 9, 10 వార్డుల కౌన్సిలర్లుగా ఎన్నికైన పరిమి సంతోషిసలోమి, కలకట్ల డాలి, కొలగాని సునీతలను యువజన సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కేక్ కోసి, ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధిలైట్లు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎస్సీ సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, 202627 బడ్జెట్లో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించి దళిత కుటుంబాల విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి మరింత అండగా నిలవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాజేంద్రప్రసాద్ తెలిపారు.
టీం ఎలైట్ యూత్ అసోసియేషన్ యువత చేస్తున్న సామాజిక, సేవా కార్యక్రమాలను అభినందించిన రాజేంద్ర ప్రసాద్, యువత సమాజ సేవలో మరింత చురుకుగా పాల్గొని పేదలు, బలహీన వర్గాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా తెలుగు యువత మాజీ అధ్యక్షులు రామినేని కుటుంబయ్య, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్, మాజీ అధ్యక్షులు రత్నం శివప్రసాద్ బుజ్జి, దాసు శ్రీనివాసరావు, కొలగాని సాంబశివరావు, పరిమి సజిత్, కలపాల సిద్దార్థ్, మరియు యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.







