పల్నాడు, 2026-11-25
పల్నాడు జిల్లాలో జరగనున్న గ్రామ పంచాయతీ, నరసరావుపేట మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల భద్రతలో సమన్వయం, అప్రమత్తత తప్పనిసరి అని జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ ఆదహళ్లి, ఐపీఎస్ సూచించారు. ఎన్నికల విధుల్లో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. నరసరావుపేటలోని కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణంలో బుధవారం ఎన్నికల బందోబస్తు విధులకు హాజరైన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎన్నికల భద్రత, విధుల నిర్వహణపై ఎస్పీ మార్గనిర్దేశం చేశారు. ప్రతి ఓటరు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్ట భద్రత కల్పించాలని ఆయన ఆదేశించారు. ప్రతి సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలు, రూట్లు, సమస్యాత్మక ప్రాంతాలు, విధుల పరిధిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిని స్పష్టంగా గుర్తించి, ఆ పరిధిలోకి అనుమతి లేని వ్యక్తులు, వాహనాలను అనుమతించరాదని, వాహనాల పార్కింగ్‌ను నిర్దేశిత పరిధికి వెలుపల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 200 మీటర్ల పరిధిలో ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఆంక్షలు అమలు చేస్తూ, రాజకీయ పార్టీల ప్రచారం, గుంపులుగా చేరడం వంటి చర్యలకు తావులేకుండా పర్యవేక్షించాలి.
మొబైల్ పెట్రోలింగ్ పార్టీలు, రూట్ మొబైల్ సిబ్బంది తమకు కేటాయించిన మార్గాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి. అవసరమైన ప్రాంతాల్లో సైరన్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ప్రజలకు సూచనలు చేస్తూ పరిస్థితులను పర్యవేక్షించాలి. విధులకు హాజరయ్యే ప్రతి పోలీసు సిబ్బంది నీట్‌గా యూనిఫాం ధరించి, తప్పనిసరిగా లాఠీ, విజిల్, అవసరమైన అత్యవసర సంప్రదింపు నంబర్లు అందుబాటులో ఉంచుకోవాలి. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను క్రమబద్ధమైన క్యూ లైన్లలో పంపిస్తూ మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి, ఓటర్లు మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పోలింగ్ కేంద్రాల్లోకి తీసుకురాకుండా సహకరించాలి. అమల్లో ఉన్న ఎన్నికల నియమావళి, పోలీసు యాక్ట్ 30, సెక్షన్ 163 నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి, ఎక్కడా గుంపులు ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. నగర, పురపాలక పోలింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల సిబ్బంది, పోలింగ్ సామగ్రి, ఈవీఎంల తరలింపునకు తగిన భద్రత కల్పించాలి. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్, లెక్కింపు ప్రక్రియ అనంతరం విజయోత్సవ ర్యాలీలు, ఘర్షణలకు ఆస్కారం లేకుండా నిరంతర నిఘా కొనసాగించాలి.
ఎన్నికల విధుల్లో ఎటువంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా, సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు భద్రతపై నమ్మకం కల్పించాలి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.







