పొదలకూరు, 2026-11-25
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మనుబోలు, పొదలకూరు మండలాల్లో మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మనుబోలు, పొదలకూరు మండలాల్లో మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి నాయకులకు ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలుస్తామనే నమ్మకం లేదని, అందుకే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారు. నామినేషన్ల తిరస్కరణ, అభ్యర్థులను భయపెట్టడం, ఓటర్లను ప్రభావితం చేయడం, ఎన్నికల గుర్తులను తారుమారు చేసే ప్రయత్నాల వరకు రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారని ఆయన మండిపడ్డారు.
కావలి నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గిరిజన కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని, వారిని కాలనీల నుండి తరలిస్తూ, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపాకు సానుభూతిపరులుగా ఉన్న గిరిజన కుటుంబాలను వారు నివసిస్తున్న ప్రాంతాల నుంచి బలవంతంగా తరలించడం, బెదిరించడం, తమ అదుపులో ఉంచుకునే ప్రయత్నాలు చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆయన అన్నారు. గూడూరు నియోజకవర్గంలో స్థానికేతరులనే పేరుతో వైకాపా నాయకులను పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన తెలిపారు. అభ్యర్థుల పేర్లలో అక్షరాల మార్పుచేసి, ఎన్నికల గుర్తుల విషయంలో గందరగోళం సృష్టించడం వంటి చర్యలతో ఓటర్లను అయోమయానికి గురిచేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. నామినేషన్ల పరిశీలనలోనూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు.
గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ అవే కుట్రలు
గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు వైకాపా తరఫున నామినేషన్లు వేసిన అభ్యర్థులను ఉపసంహరించుకోవాలని స్థానిక కూటమి నాయకులు అనేక రకాలుగా ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని కాకాణి పేర్కొన్నారు. అభ్యర్థులను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం, వివిధ రకాలుగా భయపెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పించాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేయడం ప్రతి పౌరుడికి ఉన్న ప్రజాస్వామ్య హక్కు అని, ఆ హక్కును కాలరాసే విధంగా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలే నిర్ణయించాలి తప్ప, బెదిరింపులతోనో, ప్రలోభాలతోనో అభ్యర్థులను పోటీ నుంచి తప్పించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.
కుట్రలను ఎదుర్కొని ధైర్యంగా పోరాడుతున్న వైకాపా కార్యకర్తలు
కూటమి నాయకులు ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు తీసుకొస్తున్నా వైకాపా నాయకులు, కార్యకర్తలు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదని కాకాణి అన్నారు. ధైర్యంగా ఎన్నికల బరిలో నిలబడి పోరాటం కొనసాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పార్టీ కోసం నిలబడుతున్న ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు మిమ్మల్ని బెదిరిస్తున్న వారిని, ప్రలోభాలకు గురిచేస్తున్న వారిని ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకుంటామని ఆయన హెచ్చరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ వేధింపులకు పాల్పడితే శాశ్వతంగా విజయం సాధించలేరని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టపరంగా వారికి తగిన సమాధానం చెబుతామని ఆయన స్పష్టం చేశారు.







