ఏలూరు, జూలై 21
ఏలూరు జిల్లా, కలిదిండి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన విశ్రాంత వైమానిక దళ ఉద్యోగి, రిటైర్డ్ రైల్వే టికెట్ కలెక్టర్ మద్దూరి సూర్యనారాయణ శర్మ సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చారు. గ్రామ ప్రజల భద్రత కోసం సుమారు రూ. 50,000/- ఖర్చుతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ చర్యను ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అభినందించి, సూర్యనారాయణ శర్మను ఘనంగా సత్కరించారు.
ప్రజా భద్రతకు పెద్దపీట వేస్తూ, సామాజిక బాధ్యతతో ఏలూరు జిల్లా, కలిదిండి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన విశ్రాంత వైమానిక దళ (Air Force) ఉద్యోగి, రిటైర్డ్ రైల్వే టికెట్ కలెక్టర్ శ్రీ మద్దూరి సూర్యనారాయణ శర్మ ఆదర్శనీయమైన నిర్ణయం తీసుకున్నారు.
కలిదిండి పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. గారి సూచనల మేరకు, గ్రామ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయన సుమారు రూ. 50,000/- స్వంత వ్యయంతో గోపాలపురం వంతెన మరియు బస్టాండ్ ప్రాంతాలలో దాదాపు 1000 మీటర్ల ఫైబర్ కేబుల్‌ను ఏర్పాటు చేసి మూడు అత్యాధునిక సీసీ కెమెరాలను బిగించారు.
ఈ కెమెరాలు నేరాల నివారణ, విచారణ, ట్రాఫిక్ పర్యవేక్షణతో పాటు స్థానిక ప్రజలకు మరింత భద్రత కల్పించడంలో పోలీసు శాఖకు అత్యంత ఉపయోగకరంగా నిలుస్తున్నాయి.
సూర్యనారాయణ శర్మ చూపిన ఈ సామాజిక స్పూర్తిని కైకలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ వి.రవి కుమార్ గారు గౌరవ శాసనసభ్యులు (ఎమ్మెల్యే) శ్రీ కామినేని శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఎమ్మెల్యే గారు శ్రీ మద్దూరి సూర్యనారాయణ శర్మను ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సత్కరించారు.
ఈ సత్కార కార్యక్రమంలో గౌరవ టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు శ్రీ వల్లభనేని శ్రీనివాస్ చౌదరి, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ పోకల జోగిరాజు, లేబర్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ నల్లగోపుల చలపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసు శాఖ చేస్తున్న కృషిని కొనియాడారు. రానున్న రోజుల్లో కలిదిండి మండలంలోని ప్రతి గ్రామాన్ని "సీసీ కెమెరా రక్షక గ్రామం"గా తీర్చిదిద్దేందుకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే ప్రతి సీసీ కెమెరా సమాజ భద్రతకు ఒక అదనపు కన్ను లాంటిదని పోలీసులు తెలిపారు. ప్రజా భద్రత కోసం ముందుకు వస్తున్న దాతలు, ప్రజాప్రతినిధులు, సామాజిక సేవకులు మరియు గ్రామస్థులందరూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. ప్రజల సహకారంతోనే నేరరహిత, సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఈ సత్కార్యానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ పోలీసులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.











