కందుకూరు, 2026-11-29
కందుకూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ మేరకు ఆయన పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
కౌంటింగ్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు
కందుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూములు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, అత్యవసర మార్గాల వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎన్నికల అధికారులచే అనుమతి పొందిన అభ్యర్థులు, ఏజెంట్లను గుర్తింపు కార్డు తనిఖీల అనంతరం మాత్రమే అనుమతించాలని, సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, నిషేధిత వస్తువులను లోపలికి అనుమతించరాదని స్పష్టం చేశారు. కౌంటింగ్ ఏజెంట్లు కేంద్రం నుంచి బయటకు వెళ్లి తిరిగి ప్రవేశించే విషయంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు.
వాహనదారులకు సూచనలు
కౌంటింగ్ కేంద్రానికి వచ్చే అభ్యర్థులు, ఏజెంట్ల వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే నిలిపేలా చర్యలు తీసుకోవాలని, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా వాహనదారులకు ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తూ ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని తెలిపారు.
పోలీస్ సిబ్బంది నియామకం
కౌంటింగ్ బందోబస్తు విధుల నిమిత్తం ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 12 మంది ఎస్ఐలతో పాటు మొత్తం 190 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని నియమించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
కౌంటింగ్ అనంతరం గెలుపొందిన అభ్యర్థులు, వారి మద్దతుదారులు విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, డప్పు వాయిద్యాలతో ప్రదర్శనలు, బాణసంచా కాల్చడం, ప్రత్యర్థులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, గుంపులుగా చేరి ఘర్షణలకు పాల్పడటం వంటి చర్యలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నందున ఎవరూ గుమిగూడకూడదని తెలిపారు. ఎన్నికల నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కందుకూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయ్యేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.


