రాష్ట్ర పండుగ హోదా పొందిన కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్ల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పల్నాడు జిల్లా పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సులభంగా స్వామివారిని దర్శించుకుని, తిరిగి వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక ట్రాఫిక్ నిబంధనలు, వాహనాల మళ్లింపు మార్గాలను జిల్లా ఎస్పీ శ్రీ బి. కృష్ణారావు ఐపీఎస్ గారు తెలియజేశారు.
నరసరావుపేట, వినుకొండ వైపుల నుంచి వచ్చే వాహనదారులు పెట్లూరివారి పాలెం వద్ద కోటప్పకొండ మార్గంలో ప్రవేశించి, అచ్చంపాలెం దాటిన తర్వాత ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలను నిలపాలని సూచించారు. ఎలమంద, గురువాయపాలెం, గోనేపూడి, చింతలపాలెం నుంచి వచ్చేవారు స్నానాల ఘాట్ వద్ద ఉన్న ఐరన్ బ్రిడ్జి మీదుగా వెళ్లి యాదవుల సత్రం పక్కన పార్కింగ్ లో వాహనాలు ఉంచాలి.
చిలకలూరిపేట వైపు నుంచి వచ్చేవారు శారదా ఫార్మసీ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో వాహనాలు పార్క్ చేయాలి. తిరుగు ప్రయాణంలో చిలకలూరిపేటకు వెళ్లేందుకు అక్కడే ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాయంత్రం 4 గంటల తర్వాత చిలకలూరిపేట వైపు నుంచి వచ్చే ట్రాక్టర్లు, కార్లు ఎడవల్లి వద్ద ఉన్న అట్టల ఫ్యాక్టరీ రోడ్డు మీదుగా నిధికి చేరుకోవాలి. కోటప్పకొండ టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన షటిల్ బస్సుల ద్వారా మాత్రమే భక్తులు కొండపైకి చేరుకోవాలని, కొండపైకి ద్విచక్ర వాహనాలు, కార్లు అనుమతించబడవని స్పష్టం చేశారు.
మొక్కుబడి ప్రభలతో పాటు 29 ఎలక్ట్రికల్ ప్రభలు, 49 చిన్న నాన్-ఎలక్ట్రికల్ ప్రభలు, 100కు పైగా చిన్న మొక్కుబడి ప్రభలు వస్తున్నాయని, వీటి నిర్వహణకు సంబంధిత నిర్వాహకులను ఎం.ఆర్.ఓ. వద్ద బైండోవర్ చేశామని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభల వద్ద నృత్యాలలో అశ్లీలతకు తావులేకుండా ఆర్కెస్ట్రా టీమ్స్ ను కూడా బైండోవర్ చేశారు. దొంగతనాలు, మహిళలకు ఇబ్బంది కలిగించే వారిని అడ్డుకోవడానికి మఫ్టీ పోలీసులను నియమించారు. మెట్ల మార్గంలోనూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
తిరునాళ్ల సందర్భంగా 200 సీసీ కెమెరాలు, 30 డ్రోన్లతో నిఘా ఉంచుతారు. కొండపై, కొండ కింద కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి సమన్వయం చేస్తారు. భక్తులు తప్పిపోతే పోలీసు అవుట్ పోస్టులను సంప్రదించవచ్చు. ఏదైనా ఇబ్బంది కలిగితే 9440900885 నంబర్ కు తెలియజేయాలని కోరారు. మొత్తం 2,500 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, 9 ప్లటూన్ల ప్రత్యేక పోలీసు బలగాలతో సుమారు 3,000 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. తిరునాళ్లు ముగిసిన తర్వాత కేటాయించిన మార్గాల్లోనే వాహనాలు వెళ్లాలని సూచించారు. అమరావతి, గుత్తికొండ బిలం వంటి ఇతర శైవ క్షేత్రాలలోనూ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


