చేసుకుంటూ (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 20
జిల్లా ప్రజా పరిషత్ కొత్త పాలకవర్గం కొలువుదీరింది.
జిల్లా ప్రజా పరిషత్ కొత్త పాలకవర్గం కొలువుదీరింది. జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి పి.రాజాబాబు అధ్యక్షతన శుక్రవారం పాత జడ్పీ మీటింగ్ హాలులో జరిగిన ప్రత్యేక సమావేశంలో, ఇటీవల జరిగిన జడ్పిటిసి ఎన్నికలలో విజేతలైన మొత్తం 27 మంది సభ్యులు హాజరయ్యారు. వారితో ఆయన ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ పదవుల కోసం కలెక్టర్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. ఒంగోలు జడ్పిటిసిగా ఎన్నికైన కొక్కిలిగడ్డ ప్రభాకరరావును చైర్ పర్సన్ అభ్యర్థిగా మద్దిపాడు జడ్పిటిసి ఉప్పుగుండూరి నాగేశ్వరరావు ప్రతిపాదించగా, టంగుటూరు జడ్పిటిసి ఈదర ప్రభాకరరావు బలపరిచారు. చైర్మన్ పదవికి వేరే అభ్యర్థి పేరును ఎవరూ ప్రతిపాదించకపోవడంతో, కొక్కిలిగడ్డ ప్రభాకరరావును జడ్పీ చైర్ పర్సన్ గా కలెక్టర్ ప్రకటించారు. అనంతరం వైస్ చైర్ పర్సన్ పదవి కోసం ఎన్నిక చేపట్టగా, దర్శి జడ్పిటిసి వరికూటి లక్ష్మీతాయారును సంతమాగులూరు జడ్పిటిసి ఆలూరి శ్రీవల్లి ప్రతిపాదించారు. ఆమెను తాళ్లూరు జడ్పిటిసి నాగలక్ష్మి బలపరిచారు. వైస్ చైర్ పర్సన్ పదవికి మరో పేరును ఎవరూ ప్రతిపాదించకపోవడంతో, లక్ష్మీతాయారును వైస్ చైర్ పర్సన్ గా కలెక్టర్ ప్రకటించారు. అనంతరం ఈ ఇద్దరితో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. భగవంతుని సాక్షిగా చిత్తశుద్ధితో పనిచేస్తామని వీరు ప్రమాణం చేశారు. జెడ్పి సీఈవో పుష్పగుచ్చం ఇచ్చి చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, జడ్పిటీసీలందరికీ అభినందనలు తెలిపారు. అధికారులను, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తానని చైర్ పర్సన్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన రావు, బి.ఎన్.విజయ్ కుమార్ పాల్గొన్నారు.


