భారతదేశంలో బొగ్గు గనుల వేలం ప్రక్రియకు కంపెనీల నుంచి స్పందన గణనీయంగా పెరిగింది, బిడ్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది.
దీంతో బొగ్గు గనుల తవ్వకం, వాణిజ్య కార్యకలాపాల్లో కొత్త సంస్థల ఆసక్తి పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వం 2020లో వాణిజ్య బొగ్గు గనుల వేలం విధానాన్ని ప్రారంభించింది. ఈ విధానంలో ప్రైవేటు సంస్థలు బొగ్గు గనులను వేలం ద్వారా దక్కించుకుని, తవ్విన బొగ్గును తమ అవసరాలకు మాత్రమే కాకుండా మార్కెట్లో విక్రయించుకునే అవకాశం కల్పించింది.
అంతకుముందు ఉన్న అనేక పరిమితులను తొలగించి, వాణిజ్య బొగ్గు తవ్వకాలకు అనుమతులు కల్పించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కూడా 100 శాతం వరకు ఆటోమేటిక్ మార్గంలో అవకాశం కల్పించింది. తక్కువ ముందస్తు చెల్లింపులు, సులభతరమైన నిబంధనలు, పారదర్శకమైన ఆన్లైన్ వేలం విధానం కొత్త సంస్థలను ఈ రంగం వైపు ఆకర్షిస్తున్నాయి.
వేలంలో పాల్గొనే సంస్థల నుంచి సాంకేతిక బిడ్లను పరిశీలించిన అనంతరం అర్హత సాధించిన సంస్థలను తదుపరి ఎలక్ట్రానిక్ వేలం ప్రక్రియకు ఎంపిక చేస్తారు. బొగ్గు గనుల రంగంలో ప్రైవేటు పెట్టుబడులు పెరగడం వల్ల దేశీయ బొగ్గు ఉత్పత్తికి ఊతం లభించడంతో పాటు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు అవకాశం ఉంటుందని కేంద్రం భావిస్తోంది.
అలాగే గనులు ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


