లండన్‌లోని హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో తొలిసారిగా హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది, ఇది లేబర్ ఏషియన్స్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన దీపావళి వేడుకల్లో భాగంగా నిర్వహించబడింది.
లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్‌లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఎంపీలు, హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యులు, వివిధ రంగాల ప్రముఖులు, బ్రిటిష్ ఆసియా సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు. హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు లార్డ్ ఉదయ్ నాగరాజు ఈ కార్యక్రమానికి ఆతిథ్యం వహించారు. హియర్ అండ్ నౌ 365 వ్యవస్థాపకుడు మనీష్ తివారీ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. తబలా, హార్మోనియం వంటి వాయిద్యాల మధ్య భక్తులు భక్తిశ్రద్ధలతో పారాయణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, దీపావళి పండుగ ఐక్యత, సౌభ్రాతృత్వం, చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో తొలిసారిగా హనుమాన్ చాలీసా పారాయణం జరగడం బ్రిటన్‌లోని భారతీయ సమాజానికి ఒక ప్రత్యేకమైన ఘట్టమని వారు తెలిపారు.

