ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ అష్మిత చలిహా అద్భుత ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో జపాన్‌కు చెందిన ప్రపంచ రెండో ర్యాంకర్, మూడో సీడ్ అకానె యమగుచిని వరుస గేముల్లో ఓడించి సంచలనం సృష్టించింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో అష్మిత 21-19, 21-18 తేడాతో విజయం సాధించింది.
కేవలం 37 నిమిషాల్లోనే ప్రత్యర్థిని ఓడించి తదుపరి దశకు అర్హత సాధించింది. ప్రపంచ స్థాయి క్రీడాకారిణి యమగుచితో పోటీలో అష్మిత ఆరంభం నుంచే ఆత్మవిశ్వాసంతో ఆడింది. తొలి గేమ్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనా కీలక పాయింట్ల వద్ద నిలకడ ప్రదర్శించి 21-19తో గేమ్‌ను సొంతం చేసుకుంది.
అష్మిత దూకుడు
రెండో గేమ్‌లోనూ దూకుడు కొనసాగిస్తూ 21-18తో విజయం అందుకుంది. అష్మిత వేగవంతమైన స్మాష్‌లు, చక్కటి షాట్ ప్లేస్మెంట్, కోర్టులో సమర్థవంతమైన కదలికలు ఆమె విజయానికి దోహదపడ్డాయి. ఇటీవల డెన్మార్క్ ఓపెన్‌లో యమగుచి చేతిలో ఓటమి ఎదుర్కొన్న అష్మిత, ఫ్రెంచ్ ఓపెన్‌లో అదే ప్రత్యర్థిపై గెలిచి తన సత్తా చాటింది. ఈ విజయం ఆమె అంతర్జాతీయ కెరీర్లో కీలక విజయాల్లో ఒకటిగా నిలిచింది.
పీవీ సింధు కూడా క్వార్టర్ ఫైనల్‌కు
మరోవైపు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా మహిళల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. జపాన్ క్రీడాకారిణి రికో గుంజిపై 21-12, 21-16తో విజయం సాధించింది. 44 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో సింధు ఆధిపత్యం ప్రదర్శించి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది.
ఇతర భారత క్రీడాకారుల ప్రదర్శన
అయితే, భారత యువ షట్లర్ తన్వీ శర్మకు నిరాశ ఎదురైంది. ప్రపంచ నంబర్‌వన్ అన్సెయంగ్ చేతిలో 11-21, 14-21తో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్‌లో అయుష్ శెట్టి కూడా జపాన్‌కు చెందిన కొడై నరావోకాతో మ్యాచ్‌లో గాయం కారణంగా ఆటను మధ్యలోనే నిలిపివేశాడు. ఆ సమయంలో అతడు 17-21, 6-11తో వెనుకబడి ఉన్నాడు.
ఫ్రెంచ్ ఓపెన్‌లో అష్మిత, సింధు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడంతో భారత బ్యాడ్మింటన్ అభిమానుల్లో ఆశలు పెరిగాయి. అష్మిత తదుపరి మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన నొజోమి ఒకుహారా లేదా థాయ్‌లాండ్ క్రీడాకారిణి పొర్న్పావీ చోచువాంగ్లలో ఒకరిని ఎదుర్కోనుంది.












