కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, స్థానిక కార్మిక, కర్షక, ఉద్యోగ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ ర్యాలీలో వందలాది మంది కార్మికులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
పట్టణంలోని ఎన్.ఆర్.టి సెంటర్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ, ప్రధాన వీధుల గుండా సాగి కళామందిర్ సెంటర్ వరకు కొనసాగింది. సిఐటియు, ఎఐటియుసి మరియు ఇతర సంఘాల నాయకులు ఈ సందర్భంగా ప్రసంగించారు.
నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై విమర్శలు గుప్పించారు. కార్మికుల హక్కులను హరించేలా ఉన్న కొత్త లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల కనీస వేతనాన్ని రూ. 26,000లకు పెంచాలని వారు డిమాండ్ చేశారు.
12 గంటల పని విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు కోరారు. రైతులకు నష్టం చేకూర్చే 2025 విత్తన చట్టాన్ని రద్దు చేయాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.


