చీరాల, 2026-11-27
పాపాయిపాలెం గ్రామపంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని సర్పంచ్ అభ్యర్థి గవిని పోతురాజు తెలిపారు. ఈ నెల 29న జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో తనకు కేటాయించిన మంచం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి జాతీయ రహదారితో అనుసంధానం కల్పించే కనెక్టివిటీ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. గ్రామంలోని అంతర్గత రహదారులను అభివృద్ధి చేసి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూస్తానని తెలిపారు.
అభివృద్ధి ప్రణాళికలు
అదేవిధంగా, గ్రామంలో మురుగునీటి పారుదల సమస్య పరిష్కారానికి మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. ప్రతి కుటుంబానికి సురక్షితమైన మంచినీరు అందించేలా తాగునీటి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనుల కోసం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిధులు తీసుకురావడానికి ప్రయత్నిస్తానన్నారు. ఎన్నికల సమయంలోనే కాకుండా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని స్పష్టం చేశారు.
ఈ నెల 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, మంచం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని గవిని పోతురాజు విజ్ఞప్తి చేశారు.


