సెబీ కేవైసీ నిబంధనలను సరళీకృతం చేసింది, ఇకపై ఖాతాలు తెరిచేటప్పుడు ప్రతిసారీ ఒకే రకమైన సమాచారం, పత్రాలను సమర్పించాల్సిన అవసరం ఉండదు.
సెబీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పెట్టుబడిదారులు డీమ్యాట్, ట్రేడింగ్, మ్యూచువల్ ఫండ్ ఖాతాలను సులభంగా తెరిచే వీలు కలుగుతుంది. ఆదాయ వివరాలు, వృత్తి, రాజకీయంగా ప్రభావిత వ్యక్తి () హోదా, విదేశీ పన్ను వివరాలు, సెంట్రల్ కేవైసీ గుర్తింపు సంఖ్య వంటి కీలక సమాచారాన్ని కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీలు () వద్ద కేంద్రీకృతం చేస్తారు. దీనివల్ల సమాచార పునరావృతం తగ్గుతుంది.
ఇప్పటికే ఆధార్‌తో అనుసంధానమై, కేఆర్ఏలో ధ్రువీకరించబడిన మొబైల్ నంబర్ ఉంటే, మళ్లీ దానిని ధ్రువీకరించాల్సిన అవసరం ఉండదు. అలాగే, పాన్, ఆధార్ కార్డులలో పేరు మార్పు జరిగినప్పుడు, దానికి సంబంధించిన ప్రత్యేక పత్రాలను సమర్పించాల్సిన బాధ తప్పుతుంది. ఈ మార్పులు ప్రక్రియను మరింత వేగవంతం చేస్తాయి.
ఖాతా మూసివేసిన ఐదు పనిదినాలలోగా సంబంధిత సంస్థలు కేఆర్ఏకు తెలియజేయాలి. ఆ తర్వాత రెండు పనిదినాలలో రికార్డులను నవీకరించడం లేదా తొలగించడం జరుగుతుంది. ఒకవేళ కేఆర్ఏ నుంచి వివరాలు తీసుకున్న 21 పనిదినాలలోగా ఖాతా తెరవకపోతే, ఆ రికార్డును అనుసంధానం నుంచి తొలగించే ప్రక్రియను ప్రారంభించాలి.
ధ్రువీకరించబడిన భారత చిరునామా రుజువును సమర్పించే ఓసీఐ కార్డుదారులు, విదేశీ పౌరులు ప్రత్యేకంగా విదేశీ చిరునామా రుజువును అందించాల్సిన అవసరం ఉండదు. ఈ సరళీకృత నిబంధనలు దేశీయ పెట్టుబడులను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.


