మైనర్ పిల్లల సంరక్షణ, కస్టడీకి సంబంధించిన కేసులను వారు నివసిస్తున్న ప్రాంత పరిధిలోని కుటుంబ న్యాయస్థానమే విచారించాలని గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పిల్లల సంక్షేమమే అత్యంత ప్రధానమని, వారి కస్టడీపై నిర్ణయం తీసుకునే న్యాయస్థానం పిల్లలతో నేరుగా మాట్లాడి వారి పరిస్థితిని అర్థం చేసుకోవడం అవసరమని పేర్కొంది. ఈ నేపథ్యంలో పిల్లల కస్టడీ కేసును ఇతర ప్రాంతంలోని కోర్టుకు బదిలీ చేయాలన్న ఓ మహిళ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.
ఈ కేసులో భార్యాభర్తల మధ్య వైవాహిక వివాదాలు కొనసాగుతున్నాయి. భర్త హిమ్మత్‌నగర్ కుటుంబ న్యాయస్థానంలో విడాకుల పిటిషన్ దాఖలు చేయగా, పిల్లల సంరక్షణ, కస్టడీ కోసం భార్య అదే కోర్టులో గార్డియన్స్ అండ్ వార్డ్స్ చట్టం కింద పిటిషన్ వేసింది. అయితే, భార్య తన తల్లిదండ్రులతో కలిసి రాజ్‌కోట్‌లో నివసిస్తోంది.
హిమ్మత్‌నగర్ నుంచి రాజ్‌కోట్‌కు దాదాపు 300 కిలోమీటర్ల దూరం ఉండటంతో విచారణలకు హాజరుకావడం తనకు ఇబ్బందిగా ఉందని ఆమె కోర్టుకు తెలిపింది. భరణం, గృహహింసకు సంబంధించిన ఇతర కేసులు కూడా రాజ్‌కోట్‌లోనే కొనసాగుతున్నాయని పేర్కొంటూ, భర్త దాఖలు చేసిన వైవాహిక కేసును రాజ్‌కోట్ కుటుంబ న్యాయస్థానానికి బదిలీ చేయాలని కోరింది.
అయితే, పిల్లల కస్టడీకి సంబంధించిన పిటిషన్ ఇప్పటికే హిమ్మత్‌నగర్ కోర్టులో ఉందని, అక్కడే విచారణ కొనసాగాల్సి ఉంటుందని భర్త తరఫు న్యాయవాది వాదించారు. అవసరమైన సందర్భాల్లో భార్య ప్రయాణ ఖర్చులను భరించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
పిల్లల సంక్షేమమే అత్యంత ముఖ్యం
వాదనలు పరిశీలించిన జస్టిస్ మౌలిక్ జె. షెలాట్ నేతృత్వంలోని గుజరాత్ హైకోర్టు, పిల్లలు నివసిస్తున్న ప్రాంతంలోని న్యాయస్థానానికే కస్టడీ పిటిషన్‌ను విచారించే అధికార పరిధి ఉందని పేర్కొంది. పిల్లల భవిష్యత్తు, శారీరక, మానసిక సంక్షేమం దృష్ట్యా వారి పరిస్థితిని ప్రత్యక్షంగా అర్థం చేసుకోగలిగే కోర్టులోనే విచారణ జరగడం సముచితమని తెలిపింది.
పిల్లల కస్టడీ విషయంలో తల్లిదండ్రుల మధ్య ఉన్న వివాదం కంటే పిల్లల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. కస్టడీ పిటిషన్‌ను విచారించే అధికార పరిధి లేని రాజ్‌కోట్ కోర్టుకు కేసును బదిలీ చేయడం చట్టపరంగా సాధ్యం కాదని అభిప్రాయపడింది.
వీడియో కాన్ఫరెన్స్‌కు అవకాశం
విచారణలకు హాజరయ్యేందుకు భార్య ఎదుర్కొంటున్న ప్రయాణ ఇబ్బందులను కూడా హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు అనుమతి కోరితే, వ్యక్తిగత హాజరు లేదా క్రాస్ ఎగ్జామినేషన్ అవసరమైన సందర్భాలు మినహా ఆ అభ్యర్థనను అంగీకరించాలని కుటుంబ న్యాయస్థానానికి సూచించింది.
అలాగే, విడాకుల కేసు, పిల్లల కస్టడీ కేసులను ఒకే కుటుంబ న్యాయమూర్తి విచారించాలని, వీలైనంతవరకు ఒకే తేదీన విచారణ చేపట్టాలని ఆదేశించింది. రెండు కేసులనూ సాధ్యమైనంత త్వరగా, ఉత్తర్వుల ప్రతిని అందుకున్న తేదీ నుంచి ఏడాదిలోపు పరిష్కరించేందుకు ప్రయత్నించాలని హిమ్మత్‌నగర్ కుటుంబ న్యాయస్థానానికి సూచించింది.












