నెల్లూరు గ్రామీణం, 2026-11-25
గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం సమన్వయంతో కూడిన పాలన అవసరమని, రానున్న పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకే మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో బుధవారం ఆమె కూటమి నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమన్వయంతో కూడిన పాలన ఉన్నప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా ముందుకు సాగుతాయని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో బుధవారం కూటమి నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశాంతి రెడ్డి మాట్లాడారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేయడం వల్లే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయాలు సాధించిందని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు కూటమికి బలమైన మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. ఇదే ఐక్యత, సమన్వయాన్ని రానున్న పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని, పార్టీ గుర్తులు లేకుండా జరిగే ఈ ఎన్నికల్లో కూటమి పార్టీలు బలపరిచే సర్పంచ్ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వైసీపీ పాలనలో బీసీలకు తీరని అన్యాయం
గత వైసీపీ పాలనలో బీసీ రిజర్వేషన్లు తగ్గించడం వల్ల సుమారు 16,800 మంది బీసీలు రాజకీయంగా అవకాశాలు కోల్పోయారని ప్రశాంతి రెడ్డి విమర్శించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తే, వైసీపీ కోర్టులో కేసులు వేసి అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ, ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీలకు 40 శాతం పదవులు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించాలన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.
కూటమి హయాంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వకుండా అడ్డుకున్నారని, నామినేషన్ పత్రాలను చించివేసి బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడ్డారని ప్రశాంతమ్మ విమర్శించారు. అందుకు భిన్నంగా, కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించిందని తెలిపారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చట్టబద్ధంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించి, ప్రజాతీర్పును గౌరవించామని స్పష్టం చేశారు.
ఈవీఎం అయినా.. బ్యాలెట్ అయినా ప్రజల మద్దతు కూటమికే
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవీఎంల ద్వారా సాధించిన విజయాలపై వైసీపీ అనేక విమర్శలు చేసిందని ప్రశాంతి రెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు కూటమికి ఘన విజయాన్ని అందించి, ఆ విమర్శలకు సమాధానం చెప్పారని అన్నారు. ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా ప్రజల తీర్పు మాత్రం కూటమికి అనుకూలంగానే ఉందని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు.







