క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-20
ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసిన తన్నీరు ప్రసాద్, కొత్తపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ కూటమి అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ప్రజాసేవ చేయాలనే బలమైన సంకల్పంతో పోలీసు శాఖలో తనకున్న ఉద్యోగాన్ని, ఇంకా 11 సంవత్సరాల సర్వీసు మిగిలి ఉండగానే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చానని కొత్తపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ కూటమి అభ్యర్థి తన్నీరు ప్రసాద్ తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచినట్లు ఆయన పేర్కొన్నారు. కొత్తపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి జనసేన పార్టీ తరఫున కూటమి అభ్యర్థిగా తన్నీరు ప్రసాద్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన సమక్షంలో తన్నీరు ప్రసాద్ నామినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో నామినేషన్ ర్యాలీ జనసంద్రంగా మారింది. గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా తన్నీరు ప్రసాద్ మాట్లాడుతూ, పోలీసు శాఖలో బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తూ మరో 11 సంవత్సరాల సర్వీసు ఉన్నప్పటికీ, ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయాలనే ఆలోచనతో ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రామ ప్రజల మధ్యకు వచ్చానని తెలిపారు. పదవిని అధికారంగా కాకుండా బాధ్యతగా భావిస్తానని, సర్పంచ్‌గా ఎన్నికైతే గ్రామ ప్రజలకు సేవకుడిగా పనిచేస్తానని స్పష్టం చేశారు.
కొత్తపేట గ్రామ పంచాయతీలో కులమతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. గ్రామంలోని ప్రతి సమస్యను తెలుసుకుని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తానన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాలు, మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు గ్రామ ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. చీరాల నియోజకవర్గంలో కొత్తపేట గ్రామ పంచాయతీకి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే తన ప్రధాన లక్ష్యమని, గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసుకుంటానని తన్నీరు ప్రసాద్ తెలిపారు. ప్రజలు తనపై ఉంచే నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో కూటమికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని తన్నీరు ప్రసాద్‌కు మద్దతుగా నిలిచారు. భారీ ర్యాలీతో నామినేషన్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.


