గుంటూరు, 2026-11-26
భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు, మత స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం, జీవించే హక్కు కల్పిస్తుందని గుంటూరు జిల్లా విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ చల్లా రమేష్ తెలిపారు.
ప్రపంచ రాజ్యాంగాలలో కెల్లా భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని, రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు నేడు జరుపుకోవడం ఎంతో హర్షదాయకం అని గుంటూరు జిల్లా విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ చల్లా రమేష్ అన్నారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు స్థానిక విద్యుత్ భవన్లో సీపీడీసీఎల్ డిస్కం సెక్రటరీ మామిడి చంద్రశేఖర్ అధ్యక్షతన గురువారం జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం ఆయన భారత రాజ్యాంగ దినోత్సవం, జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం ఎంతో విశిష్టంగా రూపొందించబడిందని, అందరికీ సమాన హక్కులు, మత స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం, జీవించే హక్కు కల్పించాయని అన్నారు. రాజ్యాంగం రూపొందించిన చట్టాలు నేటికి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. గుంటూరు జిల్లా విద్యుత్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ బి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా అట్టడుగు వర్గాల ప్రజలు స్వేచ్ఛ, సమానత్వంతో పాటు ఆర్థిక స్వావలంబన, మహిళా సాధికారికతతో ఎంతో అభివృద్ధిని సాధించి ఉన్నత స్థానాల్లో ఉన్నారని పేర్కొన్నారు. డిస్కం సెక్రటరీ మామిడి చంద్రశేఖర్ మాట్లాడుతూ ముఖ్యంగా దళితులు, అట్టడుగు వర్గాల ప్రజలు రాజ్యాంగ ఫలాలను వినియోగించుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నెట్ కేఫ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణారెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (కమర్షియల్) పి. సుబ్బరామమ్మ, పిఓ గిరిధర్, చంద్రశేఖర్, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నాయకులు, సబ్ ఇంజనీర్ ఎం. కోటేశ్వరరావు, లైన్ ఇన్స్పెక్టర్ కే. శివయ్య, దాసరి దాసు, ఎం. రత్నకుమారి, విద్యుత్ సర్కిల్ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






