శింగనమల (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 19
అనంతపురం జిల్లా: మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుతో కుమ్మెత హరిత ఎంపీపీగా, నల్లని శ్రీదేవి వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. దీంతో మండల పరిషత్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది.
గురువారం మండల కేంద్రంలోని కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో ఇరువర్గాలకు సమానంగా ఆరు స్థానాలు ఉండటంతో ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అనేక రాజకీయ ప్రతికూలతలు, సవాళ్లు ఎదురైనప్పటికీ, సమర్థవంతమైన వ్యూహం, నాయకుల సమన్వయం, కార్యకర్తల పట్టుదలతో తెలుగుదేశం పార్టీ మద్దతుతో కుమ్మెత హరిత ఎంపీపీగా ఎన్నికయ్యారు. నల్లని శ్రీదేవి వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ నూతనంగా ఎన్నికైన ఎంపీపీ, వైస్ ఎంపీపీలకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
సంఖ్యాబలం సమానంగా ఉన్నప్పటికీ, ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకోవడం పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు, సభ్యుల సమష్టి కృషికి నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
నూతన నాయకత్వం మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని, గ్రామీణ ప్రాంతాల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.
మండల ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజాసేవ, అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
ఈ విజయం కేవలం ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోవడమే కాదు, ప్రతికూల పరిస్థితుల్లోనూ ఐక్యతతో, పట్టుదలతో పనిచేస్తే విజయం సాధ్యమని నిరూపించిన కూటమి శ్రేణుల సమష్టి విజయం అని పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.



