రాప్తాడు, 2026-11-27
రాప్తాడు నియోజకవర్గ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే పరిటాల సునీత ధీటుగా స్పందించారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. నియోజకవర్గంలో మొత్తం 96 పంచాయతీలకు గాను 53 చోట్ల టీడీపీ, జనసేన అభ్యర్థులు ఘన విజయం సాధించారని తెలిపారు.
రాప్తాడు నియోజకవర్గ పంచాయతీ ఎన్నికల ఫలితాలను చూసి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బలుపుగా భావిస్తున్నారని, అది కేవలం వాపు అని తెలుసుకుంటే మంచిదని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. నియోజకవర్గంలోని మొత్తం 96 పంచాయతీలకు గాను 52 చోట్ల టీడీపీ, ఒక చోట జనసేన.. మొత్తం 53 స్థానాలలో అభ్యర్థులు ఘన విజయం సాధించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు రామగిరి మండలం, వెంకటాపురం, అనంతపురంలోని ఎమ్మెల్యే నివాసాలకు భారీగా తరలివచ్చి పరిటాల సునీతను కలిశారు. నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. వారిని ఘనంగా సత్కరించారు. అలాగే తమకు అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే సునీతను ఘనంగా సత్కరించి, ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ, ఎన్నికల్లో తాము అక్రమాలకు పాల్పడ్డామని ప్రకాష్ రెడ్డి ఆరోపించడం హాస్యాస్పదమని, వాపును చూసి బలుపు అనుకోవద్దని ఘాటుగా విమర్శించారు. నిజంగా తామే అధికార బలంతో అక్రమాలకు పాల్పడి ఉంటే స్వల్ప తేడాతో కోల్పోయిన మరో 20 పంచాయతీలను కూడా గెలిపించుకునే వాళ్లమని స్పష్టం చేశారు. రామగిరి మండలం పేరూరు పంచాయతీలో వైసీపీ అభ్యర్థి కేవలం ఒక్క ఓటుతో గెలిచారని, తామే గనుక ఫలితాలను తారుమారు చేసేవాళ్లమైతే ఆ ఒక్క ఓటును మేనేజ్ చేసుకోలేమా అని సూటిగా ప్రశ్నించారు. మీ కరపత్రికలో 10 ఓట్ల ఆధిక్యం ఉంటే 200 ఓట్ల భారీ ఆధిక్యం వచ్చినట్లు తప్పుడు రాతలు రాసుకుంటున్నారని విమర్శించారు. అసలు 190 ఓట్లు మార్చడం సాధ్యమవుతుందా అని నిలదీశారు. ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరిగాయన్న విషయం మీకు కూడా తెలుసని అన్నారు.
అసలు వైసీపీ గెలిచిన స్థానాల వెనుక ఉన్న అసలు లెక్కలను ప్రకాష్ రెడ్డి తెలుసుకోవాలని సునీత ఎద్దేవా చేశారు. ఒకే పంచాయతీలో తమ పార్టీకి చెందిన అభ్యర్థులు ఎక్కువ మంది రెబల్స్‌గా పోటీలో ఉండటం వల్ల ఓట్లు చీలిపోయి కొన్ని కీలక పంచాయతీలను తాము కోల్పోయామని వివరించారు. ఉదాహరణకు రాప్తాడు పంచాయతీలో వైసీపీ అభ్యర్థికి 1,405 ఓట్లు రాగా, బరిలో ఉన్న ముగ్గురు టీడీపీ మద్దతుదారులకు (965 1,365 1,305) కలిపి ఏకంగా 3,635 ఓట్లు వచ్చాయని, అంటే టీడీపీకి 2,230 ఓట్ల భారీ ఆధిక్యం ఉన్నప్పటికీ ఓట్లు చీలిపోవడం వల్ల వైసీపీ అభ్యర్థి కేవలం 40 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారని గుర్తుచేశారు. ఇదే తరహాలో ఆత్మకూరు, చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం, నాగసముద్రం పంచాయతీల్లో తమ రెబల్ అభ్యర్థుల వల్లే వైసీపీ గెలిచిందని, ఇదేనా మీ బలం అని ప్రశ్నించారు.
అంతేకాకుండా నియోజకవర్గంలోని 5 పంచాయతీల్లో టై, మరియు 1 నుంచి 40 ఓట్ల లోపు అత్యంత స్వల్ప తేడాతో తాము ఓడిపోయామని.. రంగంపేట (9), గాండ్లపర్తి (24), రాప్తాడు (40), పేరూరు (1), బసంపల్లి (37) స్థానాల్లో వైసీపీకి వచ్చిన మొత్తం మెజారిటీ కేవలం 111 ఓట్లు మాత్రమేనన్నారు. ఇక పులేటిపల్లిలో సమాన ఓట్లు రాగా లాటరీలో వైసీపీకి దక్కిందని గణాంకాలతో సహా వివరించారు. మొత్తం 96 పంచాయతీల్లో కూటమి 55 శాతం స్థానాలు 13,252 మెజారిటీ ఓట్లతో కైవసం చేసుకుంటే, వైసీపీ 43 శాతం స్థానాల వద్దే 9,831 మెజారిటీ ఓట్ల వద్ద ఆగిపోయిందన్నారు. అంటే మా రెబల్ అభ్యర్థులకు వచ్చిన 9,000 ఓట్లకన్నా మీ మెజారిటీ 831 ఓట్లు ఎక్కువ. గతంలో మీలాగా తాము అక్రమాలకు పాల్పడి ఉంటే.. ఒక్క స్థానం కూడా గెలవలేరన్నారు. ఇవి పార్టీ గుర్తు మీద కాకుండా స్థానికంగా ఎంపిక చేసిన అభ్యర్థులను బట్టి కూడా ఉంటాయన్నారు. మా పార్టీలో ఆశావహులు ఎక్కువ ఉండటం వలన కొన్ని చోట్ల మీకు అనుకూలంగా మారిందన్నారు. అంతే తప్ప ఇందులో ప్రకాష్ రెడ్డి గొప్పతనం, ఆ పార్టీ బలం కాదని తెలుసుకోవాలన్నారు. ఇకనైనా అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని ఎమ్మెల్యే పరిటాల సునీత హితవు పలికారు.



