చీరాల, 2026-11-28
రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. చీరాల నియోజకవర్గ పరిధిలోని చీరాల, వేటపాలెం మండలాల్లో 400 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు.
రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. చీరాల నియోజకవర్గ పరిధిలోని చీరాల, వేటపాలెం మండలాల్లో 400 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. చీరాల రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రావిజయలక్ష్మి సుబ్బారాయుడు కల్యాణ మండపంలో ఎన్నికల విధులకు హాజరైన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ ఎన్నికల విధులపై ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా, సమన్వయంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. చీరాల నియోజకవర్గంలో ఈ నెల 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందని, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలని, ప్రతి కేంద్రం వద్ద 100 మీటర్ల పరిధిలో సున్నపు గీత ఏర్పాటు చేసి, ఎవరూ గుమిగూడకుండా పర్యవేక్షించాలని సూచించారు.
ఎన్నికల భద్రతా ఏర్పాట్లు
ఎన్నికల భద్రతలో భాగంగా చీరాల, వేటపాలెం మండలాల్లో 8 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లు, 14 స్ట్రైకింగ్ ఫోర్స్‌లు, 20 రూట్ మొబైల్స్‌ను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి అదనపు పోలీస్ బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు.
సమర్థ్ యాప్‌తో నిరంతర పర్యవేక్షణ
ఎన్నికల విధుల్లో సాంకేతికతను వినియోగించుకోవాలని, ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది తమ మొబైల్ ఫోన్లలో సమర్థ్ యాప్‌ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవాలని ఎస్పీ సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైనా సమస్య తలెత్తితే, యాప్‌లోని బటన్ ద్వారా రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ పార్టీలు, కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తక్షణ సమాచారం చేరుతుందని వివరించారు. ద్వారా 30 సెకన్ల పాటు ఘటనకు సంబంధించిన వీడియోను కూడా పంపే అవకాశం ఉందని తెలిపారు. పోలీస్ సిబ్బంది రియల్ టైమ్ లొకేషన్ ఆధారంగా విధులను పర్యవేక్షిస్తామని తెలిపారు.
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున, ఎవరూ విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. బాపట్ల జిల్లాలో రెండో విడతలో చీరాల, వేమూరు నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో సుమారు 113 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ శాఖ పూర్తి భద్రత కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చీరాల, బాపట్ల డీఎస్పీలు ఎం.డి. మెయిన్, సీహెచ్. చంద్రమౌళి, ఎస్బీ సీఐ నారాయణ, ఎలక్షన్ సెల్ సీఐ సూర్యనారాయణ, చీరాల ఒకటవ పట్టణ, రెండవ పట్టణ, రూరల్ సీఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


