దేశంలో సహజ వాయువు రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు () కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. గ్యాస్ పైప్లైన్ల నిర్మాణానికి సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియలో సమూలమైన మార్పులు తీసుకురావడంతో పాటు, గ్యాస్ నిల్వ సౌకర్యాల ఏర్పాటుకు వినూత్న ఆర్థిక నమూనాలను పరిశీలిస్తోంది.
ప్రస్తుతం గ్యాస్ పైప్లైన్ నిర్మాణ టెండర్లలో రవాణా ధరలు, సామర్థ్యం ఆధారంగా పోటీ జరుగుతుండగా, ఇకపై నిర్మాణానికి అయ్యే మూలధన వ్యయం () ఆధారంగా బిడ్లను ఎంపిక చేయనున్నారు. తక్కువ నిర్మాణ వ్యయాన్ని ప్రతిపాదించిన సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, ప్రాజెక్టుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ మార్పుల ముఖ్య ఉద్దేశ్యం. అంచనాలకు మించి గ్యాస్ రవాణా జరగకపోయినా, నిర్మాణ సంస్థలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా చూడాలని బోర్డు యోచిస్తోంది.
కొత్త ప్రతిపాదనల ప్రకారం, ఎంపికైన ప్రాజెక్టులకు నిర్దేశిత ఈక్విటీపై 14 శాతం పన్నుల అనంతర రాబడిని కల్పించాలని యోచిస్తున్నారు. పైప్లైన్ల ఆర్థిక జీవితకాలాన్ని 40 ఏళ్లుగా పరిగణించనున్నారు. అంతేకాకుండా, కొత్త పైప్లైన్ల సాంకేతిక అంశాలు, డిమాండ్, నిర్మాణ వ్యయాలను స్వతంత్ర సంస్థల ద్వారా అంచనా వేయించాలని నిర్ణయించారు. ప్రాజెక్టులను 36 నెలల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.
ఇతర సంస్థలు కూడా పైప్లైన్లను వినియోగించుకునేందుకు అందుబాటులో ఉంచాల్సిన అదనపు సామర్థ్యాన్ని ప్రస్తుత 33 శాతం నుంచి 100 శాతానికి పెంచే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ఈ చర్యల ద్వారా గ్యాస్ మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రాజెక్టుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.


