సాంబేపల్లి, 2026-11-26
సంబేపల్లె గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సిపి సర్పంచ్ అభ్యర్థి కొప్పుల యశోధమ్మ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సంబేపల్లె మండలం సంబేపల్లె గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలు, పోలీసుల తీరుపై బాధితుల నుంచి తీవ్ర ఆవేదన వ్యక్తమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన కొప్పుల చంద్ర సతీమణి కొప్పుల యశోధమ్మ కుటుంబాన్ని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గురువారం రాత్రి పరామర్శించి అండగా నిలిచారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు పోలింగ్ కేంద్రం వద్ద తమకు ఎదురైన అవమానకర పరిణామాలను శ్రీకాంత్ రెడ్డి ఎదుట ఏకరువు పెట్టారు. సర్పంచ్ అభ్యర్థి కొప్పుల యశోధమ్మతో పాటు వార్డు సభ్యుల అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు గురువారం తెల్లవారుజామున 5 గంటలకే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, మంత్రి ఆదేశాలతోనే పోలీసులు పోలింగ్ కేంద్రం ప్రధాన ద్వారానికి తాళం వేసి తమను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పాల్గొనాల్సిన తమను అడ్డుకోవడమే కాకుండా, బలవంతంగా పోలీస్ స్టేషన్కు ఈడ్చుకెళ్లి ఇబ్బందులకు గురిచేశారని బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. పోలింగ్ కేంద్రం వద్ద చోటుచేసుకున్న పరిణామాలను, తమకు ఎదురైన ఇబ్బందులను వివరించారు.
బాధితుల ఆవేదనను ఓపికగా విన్న శ్రీకాంత్ రెడ్డి వారికి ధైర్యం చెప్పారు. అధికార బలంతో ప్రజాస్వామ్య హక్కులను అణచివేయాలని చూడటం సరైన పద్ధతి కాదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, అన్ని విధాలా తోడుగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సంబేపల్లె సర్పంచ్ అభ్యర్థి కొప్పుల యశోదమ్మ నామినేషన్ వేసినప్పటి నుంచి, అధికారపార్టీవారు దౌర్జన్యాలు చేస్తూనే ఉన్నారని, వారి పాల కేంద్రంపై దాడి చేసి పాల క్యాన్లను కాల్చడం, వైఎస్ఆర్ సిపి నాయకుడు ప్రతాప్ రెడ్డి ఇంటి వద్ద పెట్రోలు పోసి కాల్చి బెదిరింపులకు పాల్పడడం, పోలింగ్ కు రెండు రోజుల ముందు నుంచి ఏజెంట్లను పెట్టుకోనీయకుండా పోలీసులు అడ్డుకోవడం వంటి సంఘటనలను ప్రస్తావిస్తూ ఆయన ధ్వజమెత్తారు. పోలింగ్ ముందు రోజు రాత్రి అభ్యర్థి ఇంటిపై, ఏజెంట్ల ఇళ్ల వద్దకు పోలీసులు వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన దుయ్యబట్టారు. రాజ్యాంగ దినోత్సవం రోజున పోలీసులు, అధికార పార్టీ వారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని అన్నారు.





