అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్లో నిర్మించాలనుకుంటున్న 250 అడుగుల భారీ విజయ తోరణం (ట్రయంఫల్ ఆర్చ్) ప్రాజెక్టును అడ్డుకోవాలని కెన్నెడీ కుటుంబ సభ్యులు న్యాయపోరాటంలో చేరారు. ఈ మేరకు కెన్నెడీ కుటుంబానికి చెందిన తొమ్మిది మంది సభ్యులు ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ భారీ నిర్మాణం వల్ల ఆర్లింగ్టన్ జాతీయ స్మశానవాటికలో ఉన్న మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ, సెనేటర్లు రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ, ఎడ్వర్డ్ కెన్నెడీల సమాధుల దృశ్యాలు కనిపించకుండా పోతాయని, వాటిపై నీడ పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే జాన్ ఎఫ్. కెన్నెడీ స్మారక జ్వాల (ఎటర్నల్ ఫ్లేమ్) దృశ్యానికి కూడా ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ నిర్మాణానికి అమెరికా కాంగ్రెస్ అనుమతి తప్పనిసరని, సరైన చట్టపరమైన ప్రక్రియ పాటించకుండా ట్రంప్ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఆరోపించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై దాఖలైన ఇతర పిటిషన్ల నేపథ్యంలో ఫెడరల్ న్యాయమూర్తి నిర్మాణ పనులను 14 రోజుల పాటు నిలిపివేస్తూ తాత్కాలిక ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఈ తోరణం అమెరికా 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మిస్తున్న స్మారక చిహ్నమని సమర్థిస్తోంది. ఈ ప్రాజెక్టుపై న్యాయస్థానంలో వాదనలు కొనసాగుతున్నాయి.





