క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-23
డ్రామాలు, కట్టుకథలు చెప్పడం తప్ప, ప్రజలకు మేలుచేసే ఉద్దేశం వైసీపీకి లేదని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారితో కలిసి సోమవారం కందుకూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్నారు.
27వ వార్డు టెక్కలిపాలెం, 28వ వార్డు సుల్తాన్ మొహిద్దిన్ నగర్, 30వ వార్డు గుండంకట్ట ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చైర్మన్ అభ్యర్థి పిడికిటి వెంకటేశ్వర్లు, ఆయా వార్డుల అభ్యర్థులు మురారిశెట్టి శ్రీకాంత్, షేక్ సల్మా, మధిర కృష్ణవేణిలను ఆశీర్వదించి గెలిపించాలని నేతలు కోరారు.
గత వైసీపీ పరిపాలనలో కందుకూరు అభివృద్ధిని అసలు పట్టించుకోకుండా, చివరకు ఎన్నికలు కూడా జరగనివ్వకుండా అడ్డుకున్నది నిజం కాదా అని నేతలిద్దరూ ప్రశ్నించారు. అదే పార్టీ నేతలు మళ్లీ ప్రజల ముంగిటకు వచ్చి చెప్పే అబద్ధాలు నమ్మవద్దని సూచించారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ప్రకారం, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే రెండేళ్లలో చేపట్టబోయే పనుల గురించి ఎమ్మెల్యే నాగేశ్వరరావు స్థానికులకు వివరించారు.
ఈనెల 26వ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ప్రచారంలో భాగంగా సుల్తానియా మసీదులో ఎమ్మెల్యే చాదర్ సమర్పించారు. ముస్లిం సోదరులతో కలిసి దువా చేశారు. పలు దుకాణాలలోకి వెళ్లి వ్యాపారులతో మాట్లాడారు.
అంతకుముందు నేతలిద్దరినీ స్థానిక నాయకులు ఘనంగా సత్కరించి, తమ ప్రాంతాలలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు ఉన్నం వీరాస్వామి, ఆయా వార్డుల నాయకులు పాల్గొన్నారు.







