అనంతపురం, 2026-11-23
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ కె. రత్న షీలా మణిని కలిసి, ఎస్.కె.యూనివర్సిటీలో పీజీ స్పాట్ అడ్మిషన్లు నిర్వహించాలని వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు వినతిపత్రం అందజేశారు. సుమారు 1,300 సీట్లకు గాను కేవలం 201 అడ్మిషన్లు మాత్రమే జరగడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.
పీజీ అడ్మిషన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఎదురుచూస్తున్నా, కూటమి ప్రభుత్వానికి వారి ఆవేదన కనిపించడం లేదా అని వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు ప్రశ్నించారు. ఎస్.కె యూనివర్సిటీలో వందలాది సీట్లు ఖాళీగా ఉన్నా స్పాట్ అడ్మిషన్లు ఎందుకు నిర్వహించడం లేదని, ఉన్నత విద్యను అభ్యసించాలనే విద్యార్థుల ఆశలను నిర్లక్ష్యం చేయడం తగదని మండిపడ్డారు. ఖాళీగా ఉన్న పీజీ సీట్ల భర్తీకి తక్షణమే స్పాట్ అడ్మిషన్లు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, యూనివర్సిటీ నాయకుడు హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ కె. రత్న షీలా మణిని కలిసి వినతిపత్రం అందజేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, తక్షణ పరిష్కారం చూపాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా కామన్ ఎంట్రన్స్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఎస్.కె.యూనివర్సిటీలో పీజీ అడ్మిషన్లు గణనీయంగా తగ్గిపోయాయని, ఈ విద్యా సంవత్సరంలో సుమారు 1,300 సీట్లకు కేవలం 201 అడ్మిషన్లు జరగడం యూనివర్సిటీ పరిస్థితికి అద్దం పడుతోందని వారు పేర్కొన్నారు. అనేక విభాగాల్లో విద్యార్థులు లేక తరగతులు వెలవెలబోతున్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే పీజీ కోర్సుల నిర్వహణతో పాటు యూనివర్సిటీ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అడ్మిషన్లు పొందలేక విద్యార్థులు ఎదురుచూస్తుంటే, ఖాళీ సీట్లు భర్తీ చేయకుండా ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తోందని, స్పాట్ అడ్మిషన్లు నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి ఎందుకు చొరవ చూపడం లేదని వారు ప్రశ్నించారు. తక్షణమే స్పాట్ అడ్మిషన్లు నిర్వహించి ఖాళీ సీట్లలో కనీసం సగం సీట్లైనా భర్తీ చేయాలని, కామన్ ఎంట్రన్స్ విధానాన్ని పునఃసమీక్షించి యూనివర్సిటీలకు స్వతంత్ర ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎస్.కె యూనివర్సిటీలో రిజిస్ట్రార్ నియామకం, రీసెర్చ్ కమ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టు, పే స్కేల్, సుమారు రూ.43 లక్షల ఇంక్రిమెంట్ అరియర్స్ చెల్లింపులపై సమగ్ర విచారణ జరిపించాలని వారు కోరారు. ఆడిట్ అభ్యంతరాలు, నియామక ఉత్తర్వులు, వేతన చెల్లింపుల వివరాలను పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిగినట్లు తేలితే రికవరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రార్ వంటి కీలక పరిపాలనా పదవులను అర్హులైన సీనియర్ ప్రొఫెసర్లకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేసి, యూనివర్సిటీలను ఖాళీ సీట్లతో సంక్షోభంలోకి నెట్టడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు పేర్కొన్నారు. విద్యార్థుల ఎదురుచూపులకు వెంటనే తెరదించి స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని, ఉన్నత విద్యకు దూరమవుతున్న విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు ఫయాజ్, మనోజ్, హరీష్, చరణ్, శంకర్, మహేష్, షావలి, రాహుల్ రెడ్డి, విద్యార్థులు శేఖర్, వీరా, మూర్తి, గౌరీష్, సాంబ, నరేష్, వంశీ, సాయి, సూర్య తదితరులు పాల్గొన్నారు.


