బాపట్ల, 2026-11-27
కులమత భేదాలను, మూఢనమ్మకాలను ఖండిస్తూ సమానత్వం కోసం కృషి చేసిన భక్త కనకదాసు జీవితం యువతకు ఆదర్శమని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అన్నారు.
యువతకు భక్త కనకదాసు జీవితం ఆదర్శనీయం. కులమత భేదాలు, మూఢనమ్మకాలను ఖండిస్తూ సమానత్వం కోసం కృషి చేసిన మహనీయుడు కనకదాసు అని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అన్నారు. కనకదాసు జయంతిని పురస్కరించుకుని శుక్రవారం బాపట్ల కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భక్త కనకదాసు చిన్నతనంలోనే విద్యతో పాటు యుద్ధవిద్యల్లోనూ ప్రావీణ్యం సంపాదించి, విజయనగర సామ్రాజ్యంలో దళపతిగా (నాయకుడిగా) పనిచేశారని గుర్తుచేశారు. అనంతరం ఆధ్యాత్మిక, సాహిత్య రంగాల్లో విశేష కృషి చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. కనకదాసు సామాన్య ప్రజలకు సైతం సులభంగా అర్థమయ్యే సరళమైన కన్నడ భాషలో 240కి పైగా కీర్తనలు రచించారని తెలిపారు. తన రచనల్లో కాగినెలె ఆదికేశవ అనే ముద్రను ఉపయోగించారని వివరించారు. కులమత భేదాలు, మూఢనమ్మకాలను తీవ్రంగా ఖండిస్తూ సమాజంలో సమానత్వం, మానవతా విలువల స్థాపన కోసం ఆయన విశేషంగా కృషి చేశారని కొనియాడారు.
గొప్ప వ్యక్తిత్వం, ఆదర్శవంతమైన ఆలోచనలు కలిగిన భక్త కనకదాసు జీవితాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న రంగంలో పట్టుదల, కృషి, అంకితభావంతో ముందుకు సాగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి. వెంకటరమణ, జిల్లా బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, వివిధ శాఖల అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


