రాష్ట్రంలోని యువత బంగారు భవిత కోసం కూటమి ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం ఒంగోలులోని హర్షిని డిగ్రీ కళాశాల, దామచర్ల సక్కుబాయమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన యువత భవిత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్స్, పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశామని, కౌశలం ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. వైసీపీ హయాంలో గ్రూప్ 1 ఉద్యోగాల్లో అక్రమాలకు పాల్పడి రూ. 150 కోట్లు కొల్లగొట్టారని మంత్రి ఆరోపించారు. తాము మెగా డీఎస్సీ ద్వారా పారదర్శకంగా 16 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, అది ఓర్వలేకనే వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. స్పోర్ట్స్ కోటాలో ప్రతిభగల క్రీడాకారులకు పారదర్శకంగా ఉద్యోగాలు ఇచ్చామని, ఇందులో ఎలాంటి అక్రమాలు లేవని పేర్కొన్నారు. ఎక్కడైనా తప్పు జరిగినట్లు నిరూపించమని టీచర్లు సవాల్ విసిరితే, వైసీపీతోక ముడిచి సిగ్గు లేకుండా ఇంకా తప్పుడు ఆరోపణలు చేస్తోందని మంత్రి అన్నారు. రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్‌తో టీచర్లపై వైసీపీ అల్లరి మూకల దాడులు దుర్మార్గమని ఖండించారు. సమాజంలో తప్పుడు ప్రచారాలు చేస్తూ అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ ఒక ఫేక్ పార్టీ అని, వైసీపీ అసత్య ప్రచారాలను యువత నమ్మొద్దని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సూచించారు.











