దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. భారతీయ కెప్టెన్‌పై దాడి చేసి, విమాన నియంత్రణను చేపట్టాలని చూసిన అతడిని ప్రయాణికులు, సిబ్బంది చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఘటనపై దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విమానాన్ని కాక్‌పిట్ నుంచి నియంత్రణలోకి తీసుకుని, ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయం లేదా టెల్ అవీవ్‌లోని ఎత్తైన భవనాన్ని ఢీకొట్టేలా చేయాలని ఒమన్‌కు చెందిన కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ ముందుగానే ప్రణాళిక రూపొందించినట్లు దర్యాప్తు వర్గాలను ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.
ఫ్లైదుబాయ్ ఎఫ్‌జెడ్-1073 విమానం దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరింది. విమానంలో 182 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ప్రయాణ సమయంలో కో-పైలట్ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే గొడ్డలితో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై దాడి చేసినట్లు యూఏఈ అధికారులు తెలిపారు. అనంతరం విమాన నియంత్రణ వ్యవస్థలో జోక్యం చేసుకోవడంతో విమానం కొన్ని వేల అడుగుల మేర వేగంగా కిందికి పడిపోయింది.
తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ కాక్‌పిట్ తలుపు తెరవగలిగారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న విధుల్లో లేని మరో ఇద్దరు పైలట్లు నియంత్రణ చేపట్టడంతో విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌లో సురక్షితంగా దించారు.
ముందుగానే పథకం వేసినట్లు సమాచారం
దర్యాప్తులో హమ్మామీ తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో.. ఫ్లైదుబాయ్‌లో చేరకముందే దాడికి సంబంధించిన ప్రణాళికను రూపొందించినట్లు చెప్పినట్లు ఇజ్రాయెల్ అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. టెల్ అవీవ్‌కు విమానాలు నడిపే విమాన సంస్థలను పరిశీలించిన తర్వాత ఫ్లైదుబాయ్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాంటి దాడికి ప్రయత్నించే ఆలోచన చేసినప్పటికీ, విమానంలోని పరిచయస్తుడి కారణంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు సమాచారం.
మూడు స్థాయిల భద్రతపై ప్రశ్నలు
ఈ ఘటనతో ఒమన్, యూఏఈ, ఇజ్రాయెల్‌ల భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు తలెత్తాయి. ఒమన్‌లో గతంలో అతడిని విమాన విధుల నుంచి తొలగించినట్లు, అతడి తీవ్రవాద భావజాలానికి సంబంధించిన ఆందోళనలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయినప్పటికీ అతడు యూఏఈలో ఫ్లైదుబాయ్‌లో చేరి టెల్ అవీవ్ మార్గంలో విధులు నిర్వహించాడు.
మరోవైపు, విమానం బయలుదేరే ముందే యూఏఈ అధికారులు ప్రయాణికులు, సిబ్బంది వివరాలను ఇజ్రాయెల్‌కు పంపినట్లు ఏపీ నివేదిక పేర్కొంది. ఇందులో పైలట్ల పేర్లు, జాతీయతలు కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో భద్రతా తనిఖీల్లో లోపం ఎలా చోటుచేసుకుందనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విదేశీ విమానయాన సంస్థలకు సంబంధించిన భద్రతా వ్యవస్థపై సమీక్షకు ఆదేశించారు. ఇజ్రాయెల్‌కు వచ్చే విమానాల పైలట్ల గుర్తింపు, భద్రతా పరిశీలనలను మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.











