బాపట్ల, 2026-07-24
చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ప్రజల నుంచి 36కుపైగా వినతులు, అర్జీలను స్వీకరించారు. ఇంటి నిర్మాణాలు, స్థలాలు, పింఛన్లు, ఇతర సమస్యలపై ప్రజలు తమ గోడును వెళ్లబోసుకున్నారు.
ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం శుక్రవారం చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ప్రజల నుంచి నేరుగా వినతులు, అర్జీలను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 36కుపైగా అర్జీలు అందాయి. వాటిలో ఇంటి నిర్మాణాలు, ఇంటి స్థలాల కోసం 13, పింఛన్ల కోసం 9, ఇతర వివిధ సమస్యలపై 14 అర్జీలు వచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు సమర్పించిన ప్రతి వినతిని సంబంధిత అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడం ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్ధన్, కాళహస్తి బోర్డు సభ్యురాలు కొమ్మనబోయిన రజిని, బీజేపీ చీరాల నియోజకవర్గ అధ్యక్షుడు భరణి రావు, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు పోలకం శేఖర్, క్లస్టర్ ఇన్చార్జ్ తలబ్రోలు నాగేశ్వరరావు, నాగలక్ష్మి, సుబ్బలక్ష్మి, అలాగే కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











